గోదావరి వరద తో ప్రజలు తీవ్రంగా అగచాట్లు పాలవుతున్నారని, ప్రభుత్వం తగిన రీతిలో సహాయక చర్యలు చేపట్టడం లేదని, జనసేన నాయకులు స్పష్టం చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన బృందాలు గురువారం పర్యటించాయి. ఈ రెండు బృందాలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ను అందిస్తాయి. నీటి లో మునిగి ఉన్న లంక గ్రామాలను సందర్శించి అక్కడి బాధిత ప్రజలను ఓదార్చి వారికి ప్రభుత్వపరంగా అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన pac సభ్యులు కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, పంతం నానాజీ, బండారు శ్రీనివాసులు తో కూడిన బృందం ఠానే లంక, పొగాకు లంక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా అందిస్తామన్న రెండువేల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లంక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ పీఏసీ సభ్యులు బొమ్మిడి నాయకర్, చేగోండి సూర్య ప్రతాప్ లతో కూడిన బృందం నరసాపురం లోని రెండో వార్డు ఎలమంచిలి మండలం ఏనుగు వాని లంక ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కనీసం తాగు నీటిని కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు తాగునీటిని సరఫరా చేయడంతోపాటు పాము కాటుకు గురైన ఓ రైతును రెండు గంటలపాటు శ్రమించి ఏనుగు వాని లంక నుంచి పాలకొల్లు తరలించారని తెలిపారు.
