తన వ్యక్తిగత లబ్ధి కోసం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ముడుపుల కోసం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో రహస్య చెలిమి చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు ఈ మేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి ఆయన లేఖ విడుదల చేసారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది..
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి,
మీరు, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షేఖావత్ గారికి రాసిన లేఖ (2/10/2020 నాటి) అభ్యంతరకరంగా ఉంది, దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ లేఖ పూర్తిగా అసత్యాలతో ఉంది. మీ వైఫల్యాలకు, కేంద్రాన్ని నిందిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు పోతిరెడ్డిపాడు సమస్యపై, తగిన సమయంలో స్పందించకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మీరు తుంగలోకి తొక్కుతున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు.
నేను అడిగే ఈ క్రింది ప్రశ్నలకు మీరు సమాధానాలు అందించి, నిజనిజాలను తెలంగాణ ప్రజల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నాను.పోతిరెడ్డిపాడు లేదా వేరే నీటి సంబంధిత సమస్యలపై మీరు ఇప్పటివరకు కేంద్రానికి ఏ లేఖ రాయలేదనేది నిజం కాదా? మీరు గత 6 సంవత్సరాలుగా మీ ఫామ్ హౌస్‌లో నిద్రిస్తూ.. ఇప్పుడు మేల్కొన్నట్లు అనిపిస్తుందా? మీరు కేంద్రానికి రాసిన రెండు లేఖలు కృష్ణానది నీటి భాగస్వామ్యంపై నిర్ణయం తీసుకోవడానికి ట్రిబ్యునల్ కోరడానికి సంబంధించినవి. ఈ విషయంపై 2014 లో తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (ఈ విషయం ఇప్పటికే వింటున్న కెడబ్ల్యుడిటి- II) తెలంగాణ, ఏపీ రెండింటి నీటి వాటాపై నిర్ణయం తీసుకుంటుందని కోర్టు ఆదేశించింది. ట్రిబ్యునల్ ఈ విషయంపై వాదనలు వింటోంది. దాని తీర్పు ఎప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశానికి కేంద్రం కట్టుబడి ఉండదా? తెలంగాణ యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించడంలో మీ పూర్తి వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి మాత్రమే మీరు దీనిపై ఉద్దేశపూర్వకంగా కేంద్రాన్ని నిందిస్తున్నారు.
5/5/2020 న, కృష్ణానదిలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు ఆరు నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని అదనంగా తీసుకోవటానికి, సంగమేశ్వరమైడ్ వద్ద పోతిరెడ్డిపాడు విస్తరణ మరియు రాయలసీమ ఎల్ఐఎస్ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం అందించేలా ఏపీ ప్రభుత్వం జీఓ నెంబర్ 203 జారీ చేసింది. ఈ అక్రమ ప్రాజెక్టును ఆపడానికి మీరు ఇప్పటివరకు ఏమి చేస్తున్నారు? దీనిపై మీరు కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు.
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నేను 12/5/2020న కేంద్ర జల్ శక్తి మంత్రి గారికి ఒక లేఖ రాశాను, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపమని కోరుతూ కేంద్రం (కేఆర్ఎంబీ ద్వారా) స్పందించి, ఈ ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేయొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. AP ప్రభుత్వం వెనక్కు తగ్గక పోవడంతో, కేంద్రం 5/8/2020 న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని, 20/8/2020 తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించాలని మీరు కోరడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటికే AP ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తి చేయడానికి అనుమతించింది.
17/8/2020 న AP సర్కారు విజయవంతంగా టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపడం.. ఉద్దేశపూర్వకంగా టెండర్ ప్రక్రియ సాఫీగా జరిగేలా సహకరించినట్లు అర్థమవుతోంది. అప్పుడా టెండర్ల ప్రక్రియ జరిగేందుకు పరోక్షంగా సహకరించిన మీరే.. ఇప్పుడు ఆ తప్పుకు నెపాన్ని కేంద్ర ప్రభుత్వం పైకి నెట్టడం.. పక్కా ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వంపై బాధ్యతను నెట్టి మొసలి కన్నీరు కార్చడం.. చూస్తుంటే.. ఆస్కార్ అవార్డు స్థాయిలో మీరు ఆడుతున్న డ్రామాలు అందరికీ అర్థం అవుతున్నాయి.
మీరు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారనేది వాస్తవం. మీరిద్దరూ రెండు రాష్ట్రాల ప్రజలతో ఆటవికంగా వివరిస్తున్నారు. మీరిద్దరూ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నారు. తెలుగు ప్రజలకు కాకమ్మ కథలు చెబుతూ వారిని మోసగిస్తున్నారు. తద్వారా రాజకీయ లబ్ది పొందాలని మీరు ప్రయత్నించడం అత్యంత దారుణం.
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేవలం రెండు రోజుల ముందు, మీరు ఈ లేఖను కేంద్రానికి రాయడానికి కారణం ఏమిటి? అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే మీరు ఈ విషయాల గురించి చర్చించవచ్చు కదా? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న నాటకాలు మాత్రమే తప్ప మరోటి కాదు.
మీరు ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, 299 టీఎంసీలని తెలంగాణ, 512 టీఎంసీ ల నీటిని ఆంధ్ర ప్రదేశ్ వినియోగించుకునేందుకు అంగీకరించారా? లేదా? ఇది ఎంతమాత్రమూ అంగీకార యోగ్యం కాదు. ఎందుకంటే కృష్ణానది పరీవాహక ప్రాంతం 68.5 శాతం తెలంగాణలో ఉంది. తదనుగుణంగా తెలంగాణకు 555 టీఎంసీల (మొత్తం 811 టీఎంసీల నీటి లభ్యతలో 68.5%) ను తగిన వాటాగా పొందాలి. కానీ 299 టీఎంసీలకు మాత్రమే అంగీకరించడం ద్వారా.. మీరు 555 టీఎంసీలకు తగిన వాటాను పొందడంలో విఫలమై రాష్ట్ర ప్రయోజనాలను పణంగాపెట్టారు. ఈ విషయంలో మీరు ఎందుకు విఫలమయ్యారో తెలంగాణ ప్రజలకు వివరించగలరా?
అంగీకరించిన 512 టీఎంసీల కంటే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తీసుకుంటున్నందున ఈ 299 టీఎంసీల నీటిని కూడా తెలంగాణ వినియోగించడం లేదు. AP ఎక్కువగా తీసుకుంటున్న ఈ నీటి విషయంలో జోక్యం చేసుకొని తెలంగాణకు న్యాయం చేయాలని.. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (KRMB) మరియు జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్న నీటిని కొలిచేందుకు టెలిమెట్రీ స్టేషన్లను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మీరు KRMB కి ఇవ్వవలసిన తప్పనిసరి నిధులను అందించడంలో విఫలమైనందున, టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయబడలేదు. దీనికితోడు KRMB కూడా నీటి పంపకాల విషయాన్ని సరిగ్గా పర్యవేక్షించలేకపోయింది. దీనిపై మీ డబుల్ గేమ్‌ను తెలంగాణ ప్రజలకు వివరించగలరా?
నీటిపారుదల కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి.. తద్వారా కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందుకోవడానికి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమైంది. టెండర్ల ప్రక్రియ కొనసాగాలని ఉద్దేశంతోనే మీరు అప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అలాంటి మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పై దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు లేఖాస్త్రాలు సంధించడం.. మీరు ప్రదర్శిస్తున్న అర్థరహిత దూకుడు ప్రచారానికే అనేది తెలంగాణ ప్రజలకు చాలా చక్కగా అర్థమైంది. అందుకే సమయం దొరికినప్పుడు మీ గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారు అంటూ బండి సంజయ్ ఆ లేఖలో తెలంగాణా ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు.