వైకాపా లోనే ఉంటూ పార్టీపై తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. నిన్న విశాఖ చిల్డ్రన్ ఎరినా లో మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు బురద జల్లడమే పనిగా పెట్టుకుని.. మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్నారనీ, ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించారనీ.. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రతిపక్షాలు తాత్కాలికంగా నిలుపుదల చేయగలవు తప్ప శాశ్వతంగా నిలుపుదల చెయ్యలేరని అన్నారు. అమరావతి శాసనసభ రాజధానిగా ఉంచుతూ విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూల్ న్యాయ రాజధాని చేసి తీరుతామని మంత్రి అవంతి స్పష్టం చేశారు.
ఐదు సంవత్సరాల కాలం లో చంద్రబాబు అమరావతి పేరు చెప్పి కాలయాపన చేశారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లో కర్నూల్, ఉత్తరాంధ్ర విశాఖలో ప్రభుత్వ అతిధి గృహాన్ని నిర్మించే ఆలోచన చేశారు. జీవో నెం 1087 విశాఖ, కాకినాడ, కర్నూల్, విజయవాడ లో ప్రభుత్వ అతిధి గృహలు కట్టాలని కలెక్టర్ లను ఛైర్మెన్ గా చేసి ఉత్తరువులు ఇచ్చారన్నారు. ప్రభుత్వ అతిధి గృహం నిర్మించే స్థలానికి, తొట్ల కొండ కు సంబంధం లేదన్నారు. తొట్ల కొండ, బావి కొండకు ప్రభుత్వ అతిధి గృహం నిర్మిద్దాం అనుకుంటున్న స్థలానికి కిలోమీటర్ దూరం ఉంది. అది తెలియకుండా విమర్శలు చేయడం తగదన్నారు. చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు కలిసి ఫిల్మ్ క్లబ్ కట్టడానికి అడుగులు వేశారు. వాళ్ళు ఇప్పుడు అనవసరంగా రాద్దాంతంగా మాట్లాడుతున్నారు.
ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు శిఖండి లా వ్యవహరిస్తున్నారని, అసలు తోట్లకొండ ఎక్కడ ఉందో, బావి కొండ ఎక్కడ ఉందో తెలియకుండా రఘు రామకృష్ణంరాజు కేంద్రానికి లేఖలు రాయటం ఏంటి అని మండిపడ్డారు. నర్సాపురం అభివృద్ధికి ఆలోచించమని చురకలు వేసారు. ఉత్తరాంధ్ర ప్రజలు మంచి వారు ఇక్కడి ప్రజలు రాజధాని కోరుకోవడం లేదని పైయిడ్ ఉద్యమాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. సోషల్ జస్టిస్ అనే మాట్లాడే పవన్ కళ్యాణ్ రాజధాని కోసం రెండు వేల ఎకరాలు చాలు అని ఆనాడు చెప్పి ఇప్పుడు విమర్శలు చేస్తూ చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు.
