నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు K.A పాల్ అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ తరపున ఎన్నికైన రాజుగారు కొన్ని రోజులుగా పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన పాల్ నిన్న ఆయన శైలికి వ్యతిరేకంగా ఒక వీడియో విడుదల చేసారు. అదిప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాల్ స్పందనని వైసీపీ సోషల్ మీడియా లో కొందరు పోస్ట్ చెయ్యడంతో అదిప్పుడు వైరల్ గా మారింది.
రఘురామ కృష్ణం రాజు భాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, మతాల కులాల ప్రస్తావన తరచుగా తీసుకుని వస్తున్నారని పాల్ విమర్శించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నవారు బాధ్యతగా మెలగాలని దానికి భిన్నంగా ఆయన ప్రవర్తించడం విచారకరమని అన్నారు. ఆయనకు బీజేపీలో చేరే ఉద్దేశ్యం ఉంటే తప్పులేదని ఇతర మతస్తుల, కులస్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నారని ఇది ఆయన స్థాయికి తగదని హితవు పలికారు.
ఈ వీడియోపై రాజు గారి స్పందన ఏమిటో వేచి చూడాలి. పాల్ మాటలు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని ఆయన కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రంలో ఉంటారని, రాజు గారి ఆరోపణల్లో న్యాయం ఉందని ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉందని రాజు గారి అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా పాల్ వాదనలో ఎంతో కొంత నిజం ఉందని కొంతమంది వాదిస్తున్నారు. పాల్ ఎంట్రీ తో ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతోందో చూద్దాం.