గత కొన్ని రోజులుగా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు YSR కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. ఈ తిరుగుబాటుకి ఆయన పలు కారణాలు చెబుతున్నారు. పార్టీలో కీలకమైన నిర్ణయాలు అన్నీ జగన్ కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. జగన్ తో ప్రత్యక్షంగా వైరుధ్యం లేకపోయినా చుట్టూ వున్న కోటరీతోనే ఆయనకు అసలు సమస్య వస్తోందని ఆయనే స్పష్టంగా చెప్పారు. వివిధ అంశాలపై స్పష్ఠత కోసం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం లేదని ఆయన మీడియాతో చెప్పారు. పార్టీలో కుల ఆధిపత్యం నడుస్తూ ఉందని, ఒకే సామాజిక వర్గానికే ఆధిపత్యం ఇవ్వడం సరికాదని దాని వల్ల మిగిలిన కులాల్లో పార్టీకి వ్యతిరేకత వస్తుందని స్పష్టం చేశారు.
తన రాజీనామా డిమాండ్ చేస్తున్న వ్యక్తుల పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన గెలుపుతో తన సొంత ఇమేజ్ కూడా ఉందని గుర్తు చేసారు. ప్రతిపక్షం లో వున్నప్పుడు అమరావతి నే రాజధాని గా ప్రకటించిన జగన్ ఇప్పుడు మాట మార్చడం సమంజసం కాదని, తాను రైతుల కోసం రాజధాని ప్రాంతాల్లో పర్యటన చేస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం ఆపాలని పార్టీని హెచ్చరించారు. రాజు గారి వ్యూహం అర్థం కానీ కొందరు నాయకులు ఆరా తియ్యగా దీనిపై వేరే కారణాలు ఉన్నట్టుగా చెబుతున్నారు.
విజయనగరం సంస్థానానికి చెందిన మాన్సస్ ట్రస్ట్ (Maharaja Alak Narayan Society of Arts & Science) విశాఖ రాజధాని గా ప్రకటన వెలువడక ముందే ఈ ట్రస్ట్ కి చైర్ పర్సన్ గా ఉన్న అశోక్ గజపతి రాజుని తప్పించి సంచిత గజపతిరాజు ని హఠాత్తుగా నియమించడం పలు వివాదాలకు అనుమానాలకు తావిచ్చింది. ట్రస్ట్ భూములు విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నాయి. వైసిపి సర్కారు ఆ భూములపై కన్నేసి వాటి కోసమే విశాఖ రాజధాని అంశం తెరపైకి తీసుకు వచ్చిందని క్షత్రియ సామాజిక వర్గం అనుమానం. రాష్ట్రంలో పేరెన్నికగన్న విజయనగరం మహారాజా సంస్థానం భూములు అన్యాక్రాంతం అవుతాయని అనుమానంతో క్షత్రియ సామాజికవర్గం ఒకే తాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
దానికి తగ్గట్లుగానే, అర్ధరాత్రి జీవో లతో ట్రస్ట్ చైర్ పర్సన్ మార్పు చేయడం వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇదే విషయాలను తమ మనసులో ఉన్న అనుమానాలను తమ సామాజిక వర్గానికి చెందిన రఘురామ కృష్ణంరాజు దగ్గర వ్యక్తి పరిచినట్లు తెలుస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడాలంటే ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజుకే అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించడంతో ఆయన మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు.
రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే వైసిపి సోషల్ మీడియా ఆయన్ని టార్గెట్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయనలో మరియు ఆయన సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రగిలించింది. ఎంపీ అని చూడకుండా తమ అనుకూల పత్రికల్లో,టీవీల్లో, వెబ్ సైట్లలో ఆయన్ని కించపరుస్తూ దారుణాతి దారుణంగా వ్యాఖ్యానించిన విషయం తీవ్ర సంచలనం విషయంగా మారింది. అది తమ సామాజిక వర్గం పై దాడి గా భావించి రఘురామకృష్ణంరాజు కు తమ పూర్తి అండదండలు ఉంటాయి అని వారు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
