న్యాయంగా తమకు రావాల్సిన కౌలు మొత్తం అడిగేందుకు CRDA కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. రైతులను అరెస్టు చేసిన తీరును ఆయన తప్పు పట్టారు. తక్షణం వారికి రావాల్సిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేయడం భావ్యం కాదని, ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతు కి ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలని పవన్ కళ్యాణ్ కోరారు.ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కాకుండా ప్రభుత్వం గత ఏడాది కూడా ఆలస్యంగా చెల్లించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా ఇలా చేయడంవల్ల ఆ డబ్బులు వస్తాయో రావో అని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ కరోనా కష్టకాలంలో రైతులకు సకాలంలో కౌలు చెల్లించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు.
జూన్ 21వ తేదీన కౌలు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం రెండు జీవోలను జారీచేసినా.. ఇప్పటివరకు ఏ రైతు ఖాతాలలోనూ కౌలు మొత్తం జమ కాలేదని, ఈ విధంగా రైతులను క్షోభకు గురి చేయడం భావ్యం కాదన్నారు. తమ ప్రాంతంలో రాజధాని నిలుపుదల కోసం 250 రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నారని, న్యాయంగా వారికి చెల్లించాల్సిన కౌలు చెల్లించకుండా అడిగేందుకు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన రైతుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం ఖండిస్తున్నామని , తక్షణమే రైతులకు వారికి రావాల్సిన మొత్తం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
