ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న రాజధాని వివాదం అంతతొందరగా ముగిసేలా లేదు. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ తనకు తోచిన మార్గంలో చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వికేంద్రీకరణ జరిగి తీరాలని ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది. అమరావతి రైతుల ఆందోళన రోజుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా.. ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వివాదం మరియు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో.. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన ఒక సమాచారం ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించేలా ఉంది.
వీలున్నంత తొందరగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి భావిస్తుంటే, దానికి ఇప్పటిదాకా కోర్టులో చుక్కెదురు ఎదురవుతూనే ఉంది. ఇప్పుడు కోర్ట్ వారికి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దేనని రాష్ట్రాల పరిపాలన నిర్ణయాలు తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అతి త్వరలోనే ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ అంశాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలని జగన్ సర్కార్ భావిస్తూ ఉంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతి రైతులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.