ఇటీవలే ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో సీబీఐ సోదాలు అనే వార్త కలకలం రేపుతోంది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం పై ప్రత్యక్ష ఆరోపణలుకు దిగిన రాజు గారిని ఎలా కట్టడి చెయ్యాలో తెలీక ఒక దశలో వైసీపీ నేతలు తలలు పట్టుకొని కూర్చున్నారు. ప్రభుత్వ విధానాలపై మరీ ముఖ్యంగా మతపరమైన అంశాల్లో ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఒక వర్గం మీడియాలో ఆయన అభూత కల్పనలు, తప్పుడు ఆరోపణలు చేశారని వైసీపీ నేతలు ఒక రేంజ్ లో రాజు గారిపై దుమ్మెత్తి పోశారు. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో విభేదాలు లేవని చెబుతూనే ఆయన పార్టీపై విమర్శల పరంపర కొనసాగిస్తూనే వున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో సీబీఐ సోదాలు అనే వార్తలు రావడంతో వైసీపీ నేతలకు ఒక అస్త్రం దొరికినట్లు భావించాలి. ఇకపై రాజు గారిపై ప్రతిదాడి కి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రధానంగా ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వ్యాపార నిమిత్తం రుణం తీసుకుని రూ 826.17 కోట్లు దుర్వినియోగం చేసారని ఆయనకు సంబంధించిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఈ ఏడాది మార్చి 21న ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టడంతో వివాదం ముదిరి పాకానా పడింది.రంగంలోకి దిగిన సీబీఐ హైదరాబాద్, ముంబై మరియు పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. దాదాపు పదికి పైగా ప్రాంతాల్లో విస్తృతంగా జరిపిన దాడుల్లో కొన్ని కీలకమైన ఆధారాలు కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. నిధుల సేకరణ మరియ దుర్వినియోగం అంశాల్లో ఆ సంస్థకు చెందిన 11 మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది.
విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు చూపించి భారీ ఎత్తున సంస్థకు చెందిన నగదును దుర్వినియోగం చేసారని, బొగ్గు కొనుగోళ్లతో తప్పుడు సమాచారం ఇచ్చి బ్యాంక్ ను తప్పుదారి పట్టించారని బ్యాంక్ యాజమాన్యం భావిస్తోంది. ఈ దిశలోనే సీబీఐ తన విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంది. రాజు గారిని వరస ఆరోపణలు చుట్టుముట్టడంతో ఆయన స్పందన కోసం వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. నిన్న ఒక దశలో రాజు గారిపై సీబీఐ దాడి అనే వార్తలు ఖండిస్తూ ఆయన ఆయన వర్గం నుంచి వార్తలు కూడా వచ్చాయి. దాదాపుగా అన్ని ప్రచార మాధ్యమాల్లో దాడుల విషయం బయటకు వచ్చేసరికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రఘురామ కృష్ణంరాజు వైసీపీ నేతలతో ఎలా తలపడతారో అనే చర్చ జోరుగా సాగుతోంది.