పొద్దున్నే పనిమీద బజార్ కి వెళితే ఆలస్యం అయ్యింది
టిఫిన్ చెయ్యలేదేమో ఆకలి దంచేస్తుంది
ఒకటి రెండు హోటల్స్ వైపు కన్నెస్తే పెద్దగా కస్టమర్లు లేరు
వీళ్ళ దగ్గర బాగోదు కాబట్టి ఎవరూ లేరని నాకు నేనే సర్దిచెప్పుకుని మాంచి రష్ గా ఉన్న హోటల్లో దూరాను
యజమాని లావుగా చేతినిండా ఉంగరాలు పెట్టుకుని
మెడలో పలుపు తాడులాంటి బంగారం చైన్ వేసుకుని కూర్చున్నాడు
ఆ చేతిని అలా పెట్టి గుడి కట్టెయ్యచ్చు
అంతమంది దేవుళ్ళు వున్నారు
ఆ చైన్ బరువుకి కావచ్చు మెడ కొంచెం వంగి ఉంది
ఏం కావాలి..? నిర్లక్ష్యంగా అడిగాడు..
ఉల్లిదోస చెప్పాను..
ఉల్లి దోస్ అని గట్టిగా అరిచాడు..
ఉలిక్కిపడి చిల్లర తీసుకుంటే పెనం మీద చయ్ మని సౌండ్ వినిపించింది. ఇతను చెప్పిన ఆర్డర్ విన్నట్టు సిగ్నల్స్ అన్నమాట..
నేను ఫుడ్ కౌంటర్ ముందు నిలబడితే కొద్దిసేపు తర్వాత వచ్చిన ఉల్లిదోసలో మూడు రకాల చట్నీలు వేసి దూరం (పది అడుగులు) నుంచి ఒడుపుగా తోసేశాడు
కింద పడలేదు. మంచి బ్యాలన్స్ గా తోసాడు.
జనాన్ని తప్పించుకుని ఉల్లిదోశ తింటున్న నాకు మధ్యలో మంచినీళ్లు తాగలనిపించి కరోనా భయంతో అది అలాగే వదిలేసి, వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి వెళితే..
టేబుల్ తుడిచేవాడు వచ్చి నేను వదిలేసానని అనుకొని మిగిలిన సగం దోశని వేస్ట్ బకెట్లో వేసుకుని పోయాడు.
తర్వాత టీ తాగినప్పుడు గ్లాస్ కింద పెట్టలేదు నేను.
లేకపోతే అదీ పట్టుకుని డస్ట్ బిన్ లో వేసేలా వున్నాడు
మనిషికి తినే యోగం లేకపోతే ఎవడూ ఏమీ చెయ్యలేడు..!!
