తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం తర్వాత పార్టీలో నిండిన నైరాశ్యం పారద్రోలి ఉత్సాహం నింపడానికి పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది . జిల్లాల్లో నాయకత్వం పై వైసీపీ నేతలు చేస్తున్న వత్తిడికి తలొగ్గి ఇప్పటికే చాలామంది పార్టీ మారారు. పార్టీ అగ్రనేతలు సైతం కొంతమంది పార్టీని వీడటం పార్టీని ఆందోళనలోకి నెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు దిశానిర్దేశంలో లోకేష్ ని పూర్తి స్థాయిలో రంగంలోకి దింపాలని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు
ముఖ్యంగా అమరావతి రాజధాని అంశంపై పోరాటానికి పార్టీ సన్నద్ధంగా లేకపోవడం, కొన్ని జిల్లాల్లో నాయకులు పూర్తిగా స్తబ్దుగా మారిపోవడం, రాయలసీమ జిల్లాల్లో పార్టీ పూర్తిగా బలహీనపడటంపై చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. దీనిపై సత్వరమే చర్యలు తీసుకుని పర్యటనలు చెయ్యడానికి కరోనా అడ్డంకి కావడంతో ఇక ముందు ప్రణాళికాబద్దంగా పటిష్టమైన చర్యలకోసం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
లోకేష్ రాకతో తిరిగి కేడర్లో ఉత్సాహం పుంజుకుంటుందని, బలమైన కేడర్ ఉన్న పార్టీని ఆయన గాడిలో పెడతారని, పార్టీ సీనియర్ల సలహాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళితే తిరిగి టీడీపీ పుంజుకోవడం అసాధ్యమేమీ కాదని పార్టీ అభిమానులు భావిస్తున్నారు. లోకేష్ ముందున్న ప్రతికూల పరిస్థితులు అధిగమించి అధికార వైసీపీని ఎదుర్కొని పార్టీని ఎలా గాడిలో పెడతారో అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.