కరోనా కాలంగా ఆరు నెలలుగా కుంటుపడిన పర్యాటక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా చర్యలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై సచివాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ఆర్కియాలజీ అధికారులతో రాష్ట్ర యువజన, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) సమీక్షా సమావేశం నిర్వహించారు.
సెప్టెంబర్ మొదటి వారం నాటికి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులను అనుమతిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ లో పెండింగ్ పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 20న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పర్యాటక శాఖపై రివ్యూ చేయనున్నారని, సీఎం చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీ ప్రారంభిస్తామన్నారు.
