ఎన్నిసార్లు చావుదెబ్బలు తిన్నా పాక్ తన వక్రబుద్ధి పోనిచ్చుకోదు. సరిహద్దు చొరబాట్లను ప్రోత్సహించడం ఆపదు. తాజాగా జమ్మూలోని సాంబ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దులు వెంబడి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ బలగాలు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి తయారుచేసిన ఒక సొరంగ మార్గాన్ని కనుగొన్నాయి. ఆ వివరాలను శనివారం అధికారులు వెల్లడించారు. 20 అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ సొరంగ మార్గం ద్వారా భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లు, డ్రగ్స్, ఆయుధాల రవాణా కోసమే దీన్ని నిర్మించిందని అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ లో తయారైనట్లు గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని భారత్ బలగాలు గుర్తించకుండా చొరబాటుదారులు కప్పి ఉంచారు.
ఈ మార్గం బయటపడిన వెంటనే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ ఆస్తానా సాంబా సెక్టార్ లో అణువణువునా గాలించాలని ఆదేశించారు. ఈ సొరంగ మార్గం ద్వారా పాక్ నుండి ఉగ్రవాదులు చాలా సులభంగా భారత్లోకి ప్రవేశించవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గం ద్వారా ఎవరైనా ప్రవేశించి ఉంటారని అనుమానంతో బిఎస్ఎఫ్ బలగాలు విస్తృత గాలింపు చేపట్టారు.
ఇలాంటి సొరంగ మార్గాలు ఇంకేమైనా ఏర్పాటు చేశారనే అనుమానంతో సరిహద్దు వెంబడి ఎక్కడైతే సొరంగాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.