అలనాడు.. కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ అంటూ అన్నమయ్య సామాన్యులకు స్వామివారి దర్శనం భాగ్యం కలిగేలా పోరాటం చేశారు. కానీ నేడు డబ్బు కలిగిన వారికి మాత్రమే స్వామిని దర్శనం చేసుకోగలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు తీసుకునే నిర్ణయాల వలన సామాన్య భక్తులు స్వామి వారికి దూరమవుతున్నారనే చెప్పాలి.
కోవిడ్ విజృంభణ వలన ఏర్పాటుచేసిన లాక్ డౌన్ తర్వాత ఆలయంలో స్వామివారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. కానీ ఆ వచ్చే భక్తులు మాత్రం ఖచ్చితంగా దర్శనానికి డబ్బు చెల్లించాల్సిందే. డబ్బు చెల్లించలేని సామాన్య భక్తులకు సర్వదర్శన టోకెన్లను పూర్తిగా నిలుపుదల చేశారు.
స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ప్రస్తుతం మూడేమార్గాలు 1) 300/-రూపాయలతో శీఘ్ర దర్శనం. 2) ఆన్ లైన్ లో కళ్యాణం ద్వారా 1000/-తో టిక్కెట్ తీసుకున్న భక్తులు 90రోజులలో దర్శనం చేసుకోవడం. 3) శ్రీవాణి ట్రస్టుకు 10000/- విరాళం ఇచ్చి బ్రేక్ దర్శనం చేసుకోవడం.
ఈ మూడు మార్గాలు కాకుండా సామాన్య భక్తులు తిరుమల గిరులను చేరే మార్గం లేకపోవడం అనేది ఎంతో ఆవేదన కలిగిస్తోంది. లాక్ డౌన్ తర్వాత దర్శనాలు ప్రారంభించిన క్రమంలో రోజులో కొన్ని సర్వ దర్శనం టికెట్లను స్థానికంగా తిరుపతిలో అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చేవారు. అందులోని అగ్రభాగం టిక్కెట్లు స్థానికంగా ఉన్న వారే వినియోగించుకున్నారు. అందువలన ఆ విధానానికి స్వస్తి పలికిన పాలకమండలి ఆ తర్వాత ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు భక్తులు కోరుకునేది ఏమిటంటే ప్రతీరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లు కనీసం 5 వేల మందికి అయినా ఆన్ లైన్ లో సామాన్యభక్తులకు అందుబాటులో ఉంచాలని, అంతేకాక విఐపి సిఫార్సు లేఖలు కేవలం రాయలసీమ ప్రాంత నాయకులవి మాత్రమే అనుమతి ఇస్తున్నారని. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నాయకులు అది అధికార పార్టీ వారైనా సరే అనుమతించడం లేదని చెబుతున్నారు.
పై విషయాల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి దృష్టిసారించి స్వామివారి దర్శనం అందరికీ చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.