దనసరి అనసూయ, ఇలా పిలిస్తే ఆమె పలకరేమో ! ఎందుకంటే, ఆమె తన పేరు తానే మర్చిపోయి.. జనం కోసం పని చేయాలని నిర్ణయించుకొని సీతక్క గా మారి దశాబ్దాల కాలం అయింది.
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండే S.T.రిజర్వుడు స్థానం. అసెంబ్లీ పరిధిలో ఉన్న ఎనిమిది మండలాలు చాలా వరకూ అటవీ ప్రాంతం. అక్కడ ప్రజలకు ఒకప్పుడు కష్టమొస్తే అడవి వైపు చూసేవారు. అడవి బిడ్డలైన మావోయిస్టులు తమ కష్టాలు తీర్చడానికి వస్తారని. అలా నమ్మిన ప్రజల ఆలోచనలకు బాసటగా నిలవడానికి ఆమె వచ్చింది. మావోయిస్టుగా ఉండగా పోలీసుల కాల్పుల్లో 6 సార్లు మృత్యు అంచులు వరకు వెళ్లి ఉద్యమాన్ని వీడి బాహ్య ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలను తనదైన శైలిలో ఎదుర్కోవడానికి సిద్ధపడింది.
బాధిత పీడిత ప్రజల కోసం ప్రజాప్రతినిధిగా మారింది. చాలా మందిలా ప్రజా ప్రతినిధి అయిన తర్వాత ప్రజలను గాలికొదిలేసి తన స్వార్థం తాను చూసుకోలేదు. ప్రతిక్షణం ప్రజల కోసమే బ్రతికే నిస్వార్ధ నాయకురాలు సీతక్క. తనను నమ్మి ఓటు వేసిన ప్రజల కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సీతక్క ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. ప్రజల శ్రేయస్సే ఆమె ఉపిరి. ప్రజల మోముపై చిరునవ్వే ఆమె లక్ష్యంగా పనిచేస్తారు.
లాక్ డౌన్ సమయంలో అత్యంత దుర్భరమైన అటవీ ప్రాంతాలలో ఉండే తన ప్రజల కోసం మొక్కవోని దీక్షతో తిరిగి ప్రతి ఇంటికీ సహాయాన్ని అందించారు. ఇప్పుడు వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇవే కాదు సీతక్క తన నియోజకవర్గంలో ప్రజల కోసం ఎన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తాను బ్రతికేది తన కోసం కాదు. తనను ప్రేమించే అడవి బిడ్డల కోసం. ఇలాంటి ప్రజా ప్రతినిధులు అన్నిచోట్లా ఉండరు. సీతక్కలా ఇంకెవరూ ఉండలేరు..