కరోనా సోకి మృతిచెందిన వారి మృతదేహాల తరలింపు పై ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని బాపట్లలోని సైకిల్ రిక్షాలో 68 సంవత్సరాల వయస్సు గల కోవిడ్ 19 రోగి మృతదేహాన్ని ప్లాస్టిక్‌తో చుట్టి, శ్మశానవాటికకు రవాణా చేయడం వెలుగు చూసింది.
సైకిల్ రిక్షా పై మృతదేహం తరలింపు వీడియోని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. “ఈ వీడియో చూసి షాక్ కి గురయ్యాను. 108 అంబులెన్స్ ఎక్కడ ఉంది? ప్రోటోకాల్‌కు విరుద్ధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శవాలను ఎందుకు అగౌరవపరుస్తుంది?
ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు” అంటూ ఆయన విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల వారు కోరుతున్నారు.