తెలంగాణలో అధికారంలో ఉన్న T. R. S. లో నెమ్మదిగా ఒక వర్గం అసంతృప్తి గళం వినిపించడంతో పార్టీలో కలకలం మొదలయింది. పార్టీ ఏకఛత్రాధిపత్యంకి వెళ్లిపోయిందని కొంతమంది మేధావులు, ప్రజా సంఘాలు వివిధ వేదికల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాయి. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాక.. సరైన సమయంలో కొంతమంది పార్టీపై విమర్శల పర్వం మొదలుపెట్టారు
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత స్వామి గౌడ్ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో అలజడి సృష్టించాయి. ఆయన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన బడుగు బలహీన వర్గాలకు చేతికర్ర గా మారారాని పొగడ్తల వర్షం కురిపించారు. రేవంత్ కావడానికి రెడ్డి సామాజిక వర్గం అయినా ఇప్పుడు పీడిత ప్రజలకు ఏకైక దిక్కుగా మారారని కొనియాడారు. ఈ సమయంలో మేధావులు, ప్రజలు ఇక మాట్లాడవలసిన అవసరం ఉందని మౌనం తెలంగాణ సమాజానికి మంచిదికాదని ఆయన గుర్తుచేశారు.
ఆయన కామెంట్స్ పై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది అధికార పార్టీలో ఉన్న అసంతృప్త నాయకులకు దిశానిర్దేశం చెయ్యడమే అని కొంతమంది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో కీలకమైన నేతగా బీసీ నాయకుడిగా పేరున్న స్వామి గౌడ్ పై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం చిక్కుల్లో పడక తప్పదు. తెల్ల చొక్కాల నాయకులకు దూరంగా ఉండాలంటూ ఆయన చేసిన మరో కామెంట్ కూడా ఇప్పుడు వివాదాస్పదం కావడంతో ఇప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయం సర్వత్రా ఆశక్తి వ్యక్తమవుతోంది
