28 Years Later: ఐఫోన్‌తో తీసిన హారర్ మూవీ.. ఒంటరిగా చూస్తే వణికిపోవడం ఖాయం
28 Years Later: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి వచ్చే ఈ జానర్ సినిమాలు ప్రేక్షకులను భయంతో వణికిస్తాయి. జూన్‌లో థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా అదే ’28 ఇయర్స్ లేటర్’. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. మరి ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ దర్శకుడు డేనీ బోయెల్ రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమా కథ 2002లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘రేజ్ వైరస్’ తర్వాత 28 సంవత్సరాలకు జరుగుతుంది. ఈ వైరస్ సోకిన మనుషులు జాంబీలు మారిపోతారు. బ్రిటన్‌లోని ఒక దీవిలో ఈ వైరస్ బారిన పడకుండా కొద్దిమంది మనుషులు బతుకుతుంటారు. హీరో జేమీ, తన 12 ఏళ్ల కొడుకు స్పైక్, భార్యతో కలిసి ఆ దీవిలో జీవిస్తుంటాడు. ఒకరోజు వేట కోసం జేమీ, స్పైక్.. జాంబీలు ఉండే ప్రధాన భూభాగానికి వెళ్తారు. అక్కడ ‘ఆల్ఫా’ అనే అత్యంత శక్తివంతమైన జాంబీ వారికి ఎదురవుతుంది. అసలు ఆ తర్వాత ఏమైంది? తండ్రీకొడుకులు తిరిగి ద్వీపానికి చేరుకోగలిగారా? అనేదే సినిమా కథ.
ఇది సాధారణ జాంబీ సినిమా కాదు. జాంబీలు ఉన్న ప్రపంచంలో మనుషులు ఎలా బతుకుతారు, మానవ సంబంధాలు, భావోద్వేగాల గురించి ఈ సినిమా ప్రధానంగా చూపిస్తుంది. సినిమా చాలా నెమ్మదిగా సాగినప్పటికీ, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. జాంబీలు బట్టలు లేకుండా కనిపించినప్పటికీ, భయంకరమైన రీతిలో వాటిని చంపే సన్నివేశాలు ఒంటరిగా చూసే ప్రేక్షకుడిని భయపెడతాయి. సినిమా రన్‌టైమ్ కేవలం రెండు గంటల లోపే ఉండటం ప్లస్ పాయింట్.
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఐఫోన్‌తో చిత్రీకరించడం విశేషం. నటీనటుల నటన సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ’28 ఇయర్స్ లేటర్’ అనేది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ పర్వాలేదనిపిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి వీకెండ్ వాచ్.