భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధరించే “ఖాకీ నిక్కర్” ను తగలబడుతున్న విధంగా చూపిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “దేశాన్ని విద్వేషపు సంకెళ్ల నుంచి విముక్తి చేయడంతోపాటు.. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ చేసిన నష్టాన్ని పూడుస్తాం.. అంచలంచలుగా మా లక్ష్యాన్ని చేరుకుంటాం” అని ట్విట్ చేసింది.
క్షణాల్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బిజెపి నాయకులు దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. తక్షణం ఆ ఫోటోను తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ దేశాన్ని తగలబెడదామని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య దీనిపై స్పందిస్తూ “రాహుల్ గాంధీ చేస్తుంది భారత్ జోడో యాత్ర కాదని, ఆగ్ లగావో యాత్ర” అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
1984లో కాంగ్రెస్ రాజేసిన అగ్గి ఢిల్లీని తగలబెట్టింది. 2002లో గోద్రాలో 59 మంది కరసేవకులను సజీవ దహనం చేసింది. వారు మళ్లీ ఇపుడు హింసకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ‘భారత రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటం’తో, కాంగ్రెస్ రాజ్యాంగ మార్గాలపై నమ్మకంతో రాజకీయ పార్టీగా నిలిచిపోయింది. అని ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
