Aamir Khan: మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ డెలివరీ.. నాకు నిజంగా చిరాకు తెప్పిస్తుంది.. ఆమిర్ ఖాన్ కామెంట్స్
Aamir Khan: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్ అంటే కేవలం సినిమాలే కాదు, సమాజంలో, సినీ పరిశ్రమలో జరిగే అనేక అంశాలపై తన సూటి అభిప్రాయాలతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తూనే, సినిమా పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా స్పందిస్తుంటారు. తాజాగా, ఆయన మల్టీప్లెక్స్‌ల్లో సినిమా ప్రదర్శన సమయంలో ఫుడ్ సర్వ్ చేసే విధానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. సినిమా థియేటర్‌లలో ఫుడ్ సర్వీస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “సినిమా హాల్‌లో ఒక మంచి సన్నివేశం చూస్తున్నప్పుడు, ఎవరో ఒకరు వచ్చి ఫుడ్ డెలివరీ చేయడం నిజంగా చిరాకు తెప్పించే విషయం. ఇది కేవలం నాకు మాత్రమే కాదు, థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది” అని ఆయన అన్నారు. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఈ విషయంలో మార్పు తీసుకురావాలని ఆయన కోరారు. సినిమా ప్రారంభానికి ముందే లేదా విరామ సమయంలో మాత్రమే ఫుడ్, స్నాక్స్ విక్రయించాలని సూచించారు. స్క్రీన్ ముందు ఎవరైనా అడ్డంగా వెళ్లినా, ఆ కాసేపు ప్రేక్షకులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆయన వాపోయారు.
అలాగే, తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా ఆమిర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మహాభారతం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద ఇతిహాసాన్ని ఒకే సినిమాలో చూపించడం అసాధ్యమని, అందుకే దీనిని సిరీస్‌గా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ ప్రకటనతో ఆమిర్ అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ ఏడాది ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’, ‘కూలీ’ (గెస్ట్ రోల్) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం, ఆయన రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాహోర్: 1947’ చిత్రంలో నటిస్తున్నారు.