Aamir Khan: ప్రేక్షకులెవరూ పాఠాలు నేర్చుకోవడానికి థియేటర్‌కు రావట్లేదు.. అమీర్‌ఖాన్ కామెంట్స్
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్, నటుడు అమీర్ ఖాన్ తన సినీ ప్రయాణం గురించి, వ్యక్తిగత ఆలోచనల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తాను ఎప్పుడూ స్టార్‌డమ్‌ను కోరుకోలేదని, ప్రేక్షకుల్లో లభించిన గౌరవానికి, విజయానికి కృతజ్ఞతలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ సాధ్యం కాని, ప్రయోగాత్మకమైన కథలనే ఎంచుకున్నట్లు వెల్లడించారు. తాను ఎంచుకునే ప్రతి చిత్రం హిట్ అవుతుందో లేదో తెలియకపోయినా, ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం తనకు ఇష్టమన్నారు. “నిజానికి నేను స్టార్‌ని కాకూడదనుకున్నాను. ‘సర్ఫరోష్’, ‘లగాన్’, ‘తారే జమీన్ పర్’ వంటి సినిమాలు ఆ సమయంలో ప్రయోగాత్మకమైనవే. అప్పట్లో సినీ ప్రియులు వీటిని ఇష్టపడతారో లేదో అనే ఆలోచనే ఉండేది కాదు” అని అమీర్ తెలిపారు.
సామాజిక అంశాల నేపథ్యంతో సినిమాలు తీయడంపై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. తాను కార్యకర్తను కాదని, కేవలం కథలు చెప్పడానికి, సినిమాలు తీయడానికి మాత్రమే వచ్చానని పేర్కొన్నారు. “ప్రేక్షకులు సామాజిక శాస్త్రంలోని పాఠాలు నేర్చుకోవడానికి థియేటర్‌కు రావట్లేదని నాకు తెలుసు. దానికోసం వారు కళాశాలకు వెళ్తారు. నా ప్రాథమిక బాధ్యత అభిమానుల్ని అలరించడమే” అని అమీర్ ఖాన్ అన్నారు.
వినోదం అంటే కేవలం నవ్వించడం మాత్రమే కాదని, ఏడిపించగలను, భయపెట్టగలను, అన్ని జానర్‌లు చేయగలనని ఆయన పేర్కొన్నారు. ఎన్ని సినిమాలు చేసినా ఏదో ఒక విధంగా ప్రేక్షకులను ఆకర్షించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సినిమా ఎంపిక విషయంలో అమీర్ ఖాన్ తన ప్రత్యేక విధానాన్ని వివరించారు. ఈ రోజుల్లో చాలా మంది మార్కెట్లో ఏ సినిమాలు నడుస్తున్నాయి, తదుపరి ఏమి చేయాలని ఆలోచిస్తుంటారని, కానీ తాను మాత్రం ఎప్పుడూ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని కథల్ని ఎంచుకోలేదని అన్నారు.
“నాకు చిన్నప్పటి నుంచే కథల పట్ల ఆసక్తి ఎక్కువ. అదే నన్ను మంచి సినిమాల వైపు నడిపించింది. 2008లో నేను ‘గజిని’ సినిమా తీస్తున్నప్పుడు ‘ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఆడట్లేదు’ అని చాలా మంది చెప్పారు. అయినా ‘గజిని’ విడుదలైంది. దాంతోపాటు యాక్షన్ కూడా ఫ్యాషన్‌లోకి వచ్చింది” అని పాత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. చివరగా, తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడిస్తూ… ఇకపై నిర్మాతగా కాకుండా పూర్తిగా నటనకే అంకితం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ ఖాన్ ప్రకటించారు.
