Abhishek Bachchan: నిన్న ఐశ్వర్యారాయ్ హైకోర్టుకు వెళ్తే.. నేడు అభిషేక్ బచ్చన్ న్యాయస్థానం తలుపు తట్టాడు, ఎందుకంటే?
Abhishek Bachchan: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలను ఉపయోగించుకుంటున్న కొన్ని వెబ్‌సైట్‌లపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. తన ప్రచారం, వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కొన్ని వెబ్‌సైట్లు, వ్యక్తులు తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాడుకుంటున్నారని, వాటిని ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభిషేక్ బచ్చన్ కోర్టును కోరారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు AI సహాయంతో అభిషేక్ ఫొటోలను సృష్టించి, వాటిని అశ్లీల కంటెంట్‌కు ఉపయోగిస్తున్నారని నటుడి తరఫు న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించినట్లు చెప్పారు. ఈ చర్యలు తన వ్యక్తిగత ప్రతిష్టకు, కీర్తికి హాని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
సెలబ్రిటీలకు ఏఐ సమస్య
సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్న ఏఐ ఫొటోలు, వీడియోలు సెలబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇదే తరహాలో, అభిషేక్ బచ్చన్ సతీమణి, ప్రఖ్యాత నటి ఐశ్వర్య రాయ్ కూడా నిన్న(మంగళవారం) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫొటోలను అనుమతి లేకుండా ఉపయోగించకుండా నిలువరించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఐశ్వర్య రాయ్ విజ్ఞప్తిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆమె పేరు, ఫొటోలు ఉపయోగించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని సూచించింది.
ప్రస్తుతం సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకోవడానికి న్యాయపరమైన చర్యలను ఆశ్రయిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, పబ్లిసిటీ మరియు పర్సనాలిటీ హక్కుల వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ వివాదాలు భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
