Jayam Ravi: వేలానికి నటుడు జయం రవి ఇల్లు.. నోటీసు అంటించిన అధికారులు.. ఏం జరిగిందంటే?
Jayam Ravi: ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి (రవి మోహన్) ఆర్థిక వివాదాల్లో చిక్కుకున్నారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న ఆయన నివాసాన్ని వేలం వేయడానికి బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ నుంచి జయం రవి పెద్ద మొత్తంలో రుణం తీసుకోగా.. వాటిని సక్రమంగా చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంటిని జప్తు చేసిన వేలానికి నోటీసులు అంటించినట్లు తెలిపారు. నెలవారీ వాయిదాలు సుమారు ₹7.60 కోట్లు పైగా పేరుకుపోయాయి. ఈ విషయంపై బ్యాంక్ గతంలో చాలాసార్లు నోటీసులు పంపినప్పటికీ, నటుడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బ్యాంక్ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. చట్టపరమైన ప్రక్రియల్లో భాగంగా, నటుడి ఇంటిపై నోటీసులను అంటించారని కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు, ఈ ఆర్థిక వివాదానికి సంబంధించి మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల, టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థ జయం రవిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆ సంస్థతో రెండు సినిమాలు చేయడానికి ₹6 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న జయం రవి, ఆ ప్రాజెక్టుల్లో నటించకుండానే ఇతర సినిమాలను అంగీకరించారని ఆరోపించారు. ఈ క్రమంలో, తన రుణ వివాదం కారణంగా బ్యాంకు ఆస్తులను జప్తు చేయాలని భావించడంతో, సదరు నిర్మాణ సంస్థ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆస్తుల జప్తును కోరినట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
కాగా.. ఇటీవలే జయం రవి తన కెరీర్‌లో కీలక ముందడుగు వేశారు. ‘రవి మోహన్ స్టూడియోస్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. చెన్నైలో జరిగిన ఈ లాంఛ్ ఈవెంట్‌కు ఆయన ప్రేయసిగా ప్రచారం జరుగుతున్న కెన్నీషాతో కలిసి రావడం గమనార్హం. ఈ వేడుకకు శివరాజ్ కుమార్, కార్తీ, సూర్య, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించబోయే తొలి రెండు సినిమాలను కూడా ఆయన ప్రకటించారు. మొదటి సినిమాలో జయం రవి హీరోగా కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించనున్నారు. రెండవ సినిమాలో హాస్యనటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు స్వయంగా జయం రవి దర్శకత్వం వహించనుండటం విశేషం.
