Priyadarshi: ‘గడ్డి పీకాల్నా?’.. నెటిజన్‌కు ప్రియదర్శి మాస్ కౌంటర్..
Priyadarshi: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు విలక్షణమైన కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ‘పెళ్లిచూపులు’ సినిమాలో “నా చావు నేను చస్తా.. నీకెందుకు” అనే ఒక్క డైలాగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఆయన.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా ‘మల్లేశం’, ‘బలగం’ వంటి బరువైన కథలను ఎంచుకుని నటుడిగా తన స్థాయిని పెంచుకున్నారు. ఇటీవలే ‘కోర్ట్’ సినిమాతో మరో హిట్ కొట్టిన ప్రియదర్శి, తాజాగా ‘ప్రేమంటే’ అనే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌తో ఈరోజు (నవంబర్ 21న) ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రమోషన్స్‌లో ఆసక్తికర పరిణామం నవనీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ కీలక పాత్రలో మెరిశారు. సినిమా విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ ‘చిట్‌చాట్’ సెషన్‌లో నెటిజన్లు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆయన చాలా ఓపిగ్గా, సరదాగా సమాధానాలు ఇచ్చారు. అయితే, ఎక్కడో ఒకచోట విమర్శలు రావడం సహజం. అలా ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఓ నెటిజన్ అతితెలివి ప్రదర్శిస్తూ.. “నువ్వు సినిమాలు తీయడం ఆపు అన్నా.. ప్లీజ్ అన్నా” అంటూ వెటకారంగా కామెంట్ చేశాడు. దీనికి ప్రియదర్శి ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో ఘాటు రిప్లై ఇచ్చారు. “మరి ఏం చేయమంటావ్.. గడ్డి పీకాల్నా?” అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా సదరు నెటిజన్ మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. ఈసారి ప్రియదర్శి ఫుల్ మాస్ అవతారంలోకి మారిపోయారు. “నువ్వు న్యూ ట్రెండ్ అంటావ్ కదా… రేపు థియేటర్‌కి రా తమ్మి… నీ గుండెలు పిండి పంపిస్తా” అంటూ కాన్ఫిడెంట్‌గా సవాల్ విసిరారు.
హేటర్స్‌కి ప్రియదర్శి ఇచ్చిన ఈ ‘మాస్ కౌంటర్’ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనవసరమైన విమర్శలు చేసే వారికి ఇలాగే బుద్ధి చెప్పాలంటూ మద్దతు తెలుపుతున్నారు. “గట్టిగా ఇచ్చావ్ డార్లింగ్.. అలాగే ఉండు” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రియదర్శి ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే ‘ప్రేమంటే’ సినిమాలో విషయం గట్టిగానే ఉండి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ప్రియదర్శి ఖాతాలో మరో విజయాన్ని చేర్చుతుందా లేదా అనేది చూడాలి.
