Actor Shivaji: సినీ ఇండస్ట్రీలో కేవలం 5% మందే కోటీశ్వరులు.. మిగతా 95% మంది సామాన్యులే.. నటుడు శివాజీ కామెంట్స్
Actor Shivaji: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముక్కుసూటిగా వ్యవహరించే నటుడు శివాజీ తాజాగా ఇండస్ట్రీ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయట సమాజంలో సినిమా పరిశ్రమ పట్ల ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తూనే, ప్రస్తుత వివాదాలపై తన గళం వినిపించారు. సినిమా రంగం అంటే రంగుల ప్రపంచమని, అక్కడ అందరూ కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారని సామాన్య ప్రజలు భావిస్తుంటారని, కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని శివాజీ తెలిపారు.
ఇండస్ట్రీలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే స్టార్ డమ్‌తో లగ్జరీ లైఫ్ చూస్తున్నారని, మిగిలిన 95 శాతం మంది నటీనటులు, టెక్నీషియన్లు సాదాసీదా మధ్యతరగతి జీవితాన్నే గడుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆ కొద్ది మందిని చూసి పరిశ్రమ మొత్తాన్ని ఒకే గాటన కట్టి విమర్శించడం, నిందించడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు.
ఇక ఇటీవల కాలంలో పెద్ద రచ్చగా మారిన సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై కూడా శివాజీ ఘాటుగా స్పందించారు. పండుగలు, సంక్రాంతి వంటి రద్దీ సమయాల్లో ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు, ఇతర చార్జీలు మూడింతలు పెరిగినా ప్రజలు ఎవరూ ప్రశ్నించరని, కానీ సినిమా టికెట్ రేటు ఒక వంద రూపాయలు పెరిగితే మాత్రం అందరూ ఇండస్ట్రీని విలన్‌లా చూపిస్తూ రాద్ధాంతం చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. వినోదరంగాన్ని టార్గెట్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా కంటెంట్ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని, టికెట్ రేట్లు దానికి అడ్డంకి కాదని చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో ఇటీవల సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి అరెస్ట్ అంశంపై కూడా శివాజీ మాట్లాడారు. మన దేశ చట్టాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా శిక్ష అనుభవించక తప్పదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. పైరసీ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా ప్రేక్షకుల ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ.. మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్ ఆరోగ్యానికి మంచిది కాదని, వాటిని తినకపోవడమే ఉత్తమమని శివాజీ సూచించడం గమనార్హం. మొత్తానికి ఇండస్ట్రీ కష్టసుఖాలపై శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
