Aishwarya Lekshmi: సోషల్ మీడియాకు దూరమవుతున్న సినీ తారలు.. అనుష్క తర్వాత ఐశ్వర్య సంచలన నిర్ణయం
Aishwarya Lekshmi: సినీ తారలు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ ప్రకటన చేయగా, ఇప్పుడు మరో నటి అదే దారిలో నడుస్తున్నారు. తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియా నుండి పూర్తిగా విరామం తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా తనపై చూపిన ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు.
ఐశ్వర్య లక్ష్మి తన పోస్ట్‌లో, తాను మొదట్లో పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే సోషల్ మీడియా అవసరమని భావించానని పేర్కొన్నారు. కానీ, కాలంతో పాటు మారుతున్న పరిస్థితులు, తనపై సోషల్ మీడియా పెంచుతున్న ప్రభావం గురించి ఆమె ఆలోచనలు పూర్తిగా మార్చుకున్నాయి. సోషల్ మీడియాకు తాను బానిసగా మారిపోయానని, అది తన ఆలోచనలను దారి మళ్ళిస్తోందని, తనలోని సృజనాత్మకతను దెబ్బతీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“సోషల్ మీడియా నాలో నెగెటివిటీని పెంచింది. నేను ఒక సర్కిల్‌లో లాక్ అయిపోయాను. ఒక మహిళగా, నేను ఎంతో కష్టపడి నన్ను నేను మెరుగుపరుచుకున్నాను. కానీ, ఈ డిజిటల్ ప్రపంచానికి లొంగిపోవడం నాకు ఇష్టం లేదు” అని ఆమె రాసుకొచ్చారు.
“ప్రపంచం నన్ను మర్చిపోతుందనే రిస్క్‌కు నేను సిద్ధంగా ఉన్నాను. నాలోని కళాకారిణిని, నాలో ఉన్న చిన్న పాపని కాపాడుకోవడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంటర్నెట్ నుండి పూర్తిగా అదృశ్యమవ్వడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఐశ్వర్య తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత అర్థవంతమైన బంధాలను, మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నానని, తాను నిజంగా మంచి సినిమా చేస్తే, ప్రేక్షకులు పాత తరం మాదిరిగానే ప్రేమను పంచుతారని ఆశిస్తున్నానని ఆమె తన పోస్ట్‌లో తెలిపారు.
కాగా.. ఘాటి’ చిత్రంలో అనుష్క ‘శీలావతి’ పాత్రలో నటించినప్పటికీ, సినిమాలోని కథా లోపాలు, నెమ్మదిగా సాగే కథనం సినిమా వైఫల్యానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ సినిమా అనుష్క చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించినది కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఫెయిల్ అవ్వడంతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.