Nagarjuna Isha: ఆ హీరోయిన్‌ను 15 సార్లు కొట్టిన నాగార్జున.. ఇన్నేళ్లకు బయటకు చెప్పిన ఇషా కొప్పికర్
Nagarjuna Isha: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో 1998లో విడుదలైన మ్యూజికల్ హిట్ చిత్రం ‘చంద్రలేఖ’. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి ఇషా కొప్పికర్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒక సన్నివేశం అద్భుతంగా పండటం కోసం నాగార్జునతో కావాలనే అనేకసార్లు చెంపదెబ్బలు కొట్టించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
15 చెంప దెబ్బలు, వాతలు..
‘చంద్రలేఖ’ తన కెరీర్‌లో రెండో సినిమా అని ఇషా కొప్పికర్ తెలిపారు. “నాగార్జున నన్ను కోపంగా కొట్టే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్ సహజంగా రావాలని నేను అనుకున్నాను. అందుకే ఆయనతో నిజంగానే కొట్టమని చెప్పాను. మొదట ఆయన చాలా నెమ్మదిగా కొట్టారు. దాంతో సీన్ సరిగ్గా రాలేదు. ‘నాకు కోపం రావడం లేదు, మీరు గట్టిగానే కొట్టండి’ అని మరోసారి చెప్పాను. ఆ ఒక్క సీన్ కోసం దాదాపు 14, 15 సార్లు రీటేక్‌లు తీసుకున్నారు. నాగార్జున ప్రతిసారీ నా చెంపపై గట్టిగా కొట్టారు. సన్నివేశం పూర్తయ్యేసరికి నా ముఖమంతా కందిపోయి, చెంపలపై వాతలు పడ్డాయి” అని ఇషా వివరించారు.
సన్నివేశం అయిపోయిన తర్వాత తన పరిస్థితి చూసి నాగార్జున బాధపడి క్షమాపణలు చెప్పారని, అయితే తాను ఆయన్ను వారించి, సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు ఇలాంటివి సహజమే అని అన్నానని ఇషా గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన అప్పటి షూటింగ్‌లో యూనిట్ సభ్యులను సైతం ఆశ్చర్యపరిచిందని ఆమె తెలిపారు.
ఇషా కొప్పికర్ కెరీర్ ప్రస్థానం
1997లో ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్’ సినిమాలో అతిథి పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన ఇషా కొప్పికర్, రెండో సినిమాలోనే నాగార్జున వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆమె తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. 50కి పైగా చిత్రాలు, పలు వెబ్‌సిరీస్‌లలో కనిపించారు. 2017లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’లో ఆమె చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం మరాఠీ, హిందీ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.