Pragathi: జిమ్‌కు ఆ దుస్తుల్లోనే వెళ్లాలి.. ట్రోల్స్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన నటి ప్రగతి
Pragathi: నటిగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ప్రగతి ఇటీవల క్రీడా రంగంలోనూ సత్తా చాటారు. తాజాగా జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా నాలుగు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అపూర్వ విజయం సాధించిన తర్వాత, ఆమె పవర్ లిఫ్టింగ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎదుర్కొన్న ట్రోలింగ్‌పై తొలిసారిగా గళం విప్పారు.
తాజాగా ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రగతి మాట్లాడుతూ… తాను సాధించిన నాలుగు పతకాలను సినీ పరిశ్రమలో ఉన్న మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం, కొనసాగడం ఎంత కష్టమో తనకు తెలుసని, అందుకే వారిని గౌరవిస్తూ ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
“నేను సాధారణంగా మీడియాకు కొంచెం దూరంగా ఉంటాను. నన్ను ఎక్కడ ట్రోల్ చేస్తారో అనే భయంతోనే అలా ఉంటున్నాను,” అని ప్రగతి తన భయాన్ని బయటపెట్టారు. పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ ప్రారంభించిన సమయంలో ఎదురైన విమర్శల గురించి ఆమె మాట్లాడుతూ, “నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నానని చాలామంది అన్నారు. కానీ నేను సినిమాలు ఎప్పటికీ మానలేను. ఎందుకంటే నటించకపోతే నేను బతకలేను. నా గుర్తింపు, నా జీవనాధారం ఈ పరిశ్రమే. తుదిశ్వాస వరకు నటిస్తూనే ఉంటాను, చివరికి సెట్‌లో కన్నుమూయాలని కోరుకుంటా” అని సినీ పరిశ్రమపై తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు.
పవర్ లిఫ్టింగ్‌ను సరదాగా ప్రారంభించి పతకాలు సాధించినప్పటికీ, జిమ్‌లో తాను ధరించే దుస్తులపై, తన వయస్సుపై వచ్చిన ట్రోల్స్ ఆమెను తీవ్రంగా కలచివేశాయి. “చాలామంది ‘ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా?’ అన్నారు. జిమ్‌లో నా దుస్తులపై కూడా విమర్శలు చేశారు. జిమ్‌కు వెళ్లినప్పుడు చీర కట్టుకుని కానీ, చుడీదార్‌లో కానీ నేను వర్కౌట్ చేయలేను, అందుకే ప్రత్యేక దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది,” అని ఆమె స్పష్టం చేశారు. ఆ ట్రోల్స్ చూసి తాను నిజంగానే తప్పు చేస్తున్నానేమోనని, తన కూతురికి తన వల్ల ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడ్డానని ఆమె పేర్కొన్నారు.
అయితే, చివరకు ఆ ట్రోల్స్‌ను పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లినట్లు, పతకాలు సాధించి వారికి సమాధానం చెప్పినట్లు ప్రగతి తెలిపారు. “మీరు మాకు (ఇండస్ట్రీ మహిళలకు) ఏమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు, కనీసం కొంచెం మర్యాద ఇవ్వండి,” అని ఆమె ట్రోలర్స్‌ను ఉద్దేశించి వేడుకున్నారు. ప్రగతి చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో విశేష స్పందన పొందుతున్నాయి.
