Adah Sharma: అందాల అదా శర్మను దేశంలో సగం మంచి చంపాలనుకున్నారా.. అసలేం జరిగిందంటే?
Adah Sharma: తెలుగు ప్రేక్షకులకు ‘హార్ట్ ఎటాక్’, ‘క్షణం’ వంటి చిత్రాలతో పరిచయమైన నటి అదా శర్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో సరికొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. రిస్క్ తీసుకోవడానికి వెనుకాడకుండా సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో అదా ముందుంటారు. ఈ ధైర్యమే ఆమె కెరీర్‌కు ఊహించని మలుపునిచ్చింది.
2008లో ‘1920’ అనే హారర్ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అదా శర్మ, తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ సరసన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’, ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే, టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవడంతో ఆమె బాలీవుడ్‌పై దృష్టి సారించింది.
అదా శర్మ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (2023). మహిళా ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ చర్చకు, రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. విడుదలకు ముందు అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఈ చిత్రం ఏకంగా ₹400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అదా శర్మ ఓవర్ నైట్ నేషనల్ సెన్సేషన్‌గా మారింది.
“ది కేరళ స్టోరీ విడుదలైనప్పుడు దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు. కానీ మిగతా సగం మంది నన్ను ప్రేమించి రక్షించారు,” అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదా తన అనుభవాన్ని పంచుకున్నారు. పాత్రలో భావోద్వేగం, యాక్షన్ సీన్లు ఉంటేనే తనకు నచ్చుతుందని, ‘1920’ చిత్రం నుంచే తాను రిస్క్ ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నానని, ఆ రిస్క్ వల్లే నేడు తనకు ఈ గుర్తింపు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.
వివాదాస్పద పాత్రలతో పాటు, వ్యక్తిగత జీవితంలోనూ అదా ధైర్యంగా వ్యవహరిస్తున్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లోనే ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఆ ఫ్లాట్‌ను చాలా మంది అద్దెకు తీసుకోవడానికి భయపడినప్పటికీ, అదా శర్మ మాత్రం నిస్సంకోచంగా అక్కడే ఉండటం ఆమె సాహసానికి నిదర్శనం. ఇటీవలే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమాలో శక్తివంతమైన పాత్రలో కనిపించిన అదా, ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతున్నారు. సవాలుతో కూడిన, రిస్క్ ఉన్న పాత్రల ఎంపికతోనే అదా శర్మ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
