Major Unnikrishnan: మేజర్ ఉన్నికృష్ణన్ కుటుంబాన్ని కలిసిన అడివి శేష్
Major Unnikrishnan: టాలీవుడ్ కథానాయకుడు అడివి శేష్ మరోసారి తన మానవత్వాన్ని, దేశభక్తిని చాటుకున్నారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వర్ధంతి సందర్భంగా, నవంబర్ 26న ఆయన తల్లిదండ్రులను శేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశం గర్వించదగ్గ ఈ సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మేజర్’లో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించి, అసాధారణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
‘మేజర్’ సినిమా విడుదలై మూడేళ్లు గడిచినప్పటికీ, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబంతో శేష్‌కు ఏర్పడిన అనుబంధం రోజురోజుకూ బలపడుతోంది. ప్రతి సంవత్సరం నవంబర్ 26న, మేజర్ అమరులైన రోజున, వారి కుటుంబాన్ని కలిసి కొంత సమయం గడపడం అడివి శేష్‌కు ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా, అడివి శేష్ ముందుగా ముంబైలోని మేజర్ స్మారక చిహ్నం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులైన శ్రీమతి ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ మరియు శ్రీ ఉన్నికృష్ణన్లను కలుసుకుని, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
సినిమా బృందంతో చెక్కుచెదరని బంధం
“మేజర్ సినిమా బృందానికి, ఉన్నికృష్ణన్ కుటుంబానికి మధ్య ఏర్పడిన అనుబంధం కేవలం సినిమాకే పరిమితం కాలేదు. ఇది చాలా పవిత్రమైన బంధం. మేజర్ గారి తల్లిదండ్రులు చూపే ప్రేమ, స్ఫూర్తి నాకు ఎంతో గొప్పది,” అని అడివి శేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఉన్నికృష్ణన్ గారి త్యాగం గురించి ఈ తరానికి తెలియజేయడం, వారి కుటుంబాన్ని గౌరవించడం తన బాధ్యతగా భావిస్తున్నానని శేష్ అన్నారు. అడివి శేష్ నిబద్ధత, ఆయన చూపిన ప్రేమ, గౌరవం పట్ల మేజర్ సందీప్ తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ‘మేజర్’ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయినా, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ త్యాగాన్ని, దేశం కోసం ఆయన చేసిన సేవను అడివి శేష్ బృందం మర్చిపోకపోవడం పట్ల సినీ వర్గాలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.