టాటా గ్రూప్‌కి చెందిన ఎయిర్ ఇండియా వృద్ధులకు, విద్యార్థులకు ఇచ్చే టికెట్ ధరల్లో డిస్కౌంట్లను సగానికి తగ్గించింది. సవరించిన డిస్కౌంట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది ఎయిర్ ఇండియా.
పలు రకాల టికెట్లపై వృద్ధులు, విద్యార్థులకు టికెట్ రేటుపై 50శాతం డిస్కౌంట్లు ఇచ్చేది ఎయిర్ ఇండియా. తాజా నిర్ణయంతో ఆ డిస్కౌంట్ 25శాతానికి పడిపోయింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఆ సంస్థ అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి.
ప్రభుత్వ ఆధీనంలో భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ఈ ఏడాది జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సంస్థ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది టాటా గ్రూప్.