Aishwarya Rai: నా పేరు, ఫోటోలు వాడొద్దు.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్
Aishwarya Rai: ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ తమ వ్యక్తిగత గోప్యతను, తన హక్కులను కాపాడాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరును, ఫొటోలను, వాయిస్‌ను ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగించకుండా నిలువరించాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఎవరూ ఐశ్వర్య పేరు, చిత్రాలను అనధికారికంగా వాడకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది.
ఐశ్వర్య తరఫు న్యాయవాది సందీప్ సేథి కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, కొంతమంది వ్యక్తులు ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి, టీ-షర్టులపై ముద్రించి వ్యాపారం చేస్తున్నారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఆమె చిత్రాలతో అసభ్యకరమైన వీడియోలు సృష్టించి వాటిని యూట్యూబ్ ఛానెళ్లలో ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి చర్యలు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు, గుర్తింపుకు హాని కలిగించడమే కాకుండా, నకిలీ వార్తలకు దారితీస్తున్నాయని ఆయన వాదించారు.
ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, నకిలీ వీడియోలు, ఫొటోల విషయంలో తీవ్రంగా స్పందించింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఐశ్వర్య బృందం కోర్టుకు సమర్పించింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 15న జరగనుంది.
ఇదిలా ఉండగా, గతంలో ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు కథనాలపైనా న్యాయపోరాటం చేశారు. ఆరాధ్య తీవ్ర అనారోగ్యంతో ఉందని, ఇక లేదని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో కోర్టు, పిల్లలకు సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తూ ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఐశ్వర్య వ్యక్తిగత గోప్యత, గౌరవంపై జరుగుతున్న ఈ దాడులు సైబర్ ప్రపంచంలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి వెలుగులోకి తెస్తున్నాయి.