Akhanda 2: ‘అఖండ 2’ నుంచి క్రేజీ అప్డేట్.. తగ్గేదేలే అంటున్న బాలయ్య
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం తాజాగా ఒక కీలక అప్‌డేట్‌ను విడుదల చేసి, అభిమానులకు సంతోషం కలిగించింది.
‘అఖండ 2’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా, బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుపుతూ, చిత్ర యూనిట్ ఒక ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ పనులను ఒకేసారి పూర్తి చేస్తున్నారని, ఆగస్టు చివరి నాటికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.
గతంలో సెప్టెంబర్ 25న విడుదలవుతుందని వార్తలు వచ్చినా, పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా కూడా అదే సమయంలో వస్తుందనే ప్రచారం నేపథ్యంలో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే, డబ్బింగ్ పనులు పూర్తి కావడంతో చిత్రబృందం సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పోటీకి వెనుకాడబోమని టీమ్ ధీమాగా ఉన్నట్లు సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు
2021లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. బాలయ్య అఘోర పాత్ర, బోయపాటి దర్శకత్వం, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఒక సంచలనంగా నిలిపాయి. ఇప్పుడు ఆ ఫార్ములాను మరింత శక్తివంతంగా ‘అఖండ 2’లో చూపించనున్నారు. ఈ సినిమా హిందీ బెల్ట్‌లో కూడా భారీగా వసూలు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్, సంజయ్ దత్, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగం. ఈసారి యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, సనాతన ధర్మం అంశాలు పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. అధికారిక విడుదల తేదీ ప్రకటన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.