Akhanda 2: అఖండ 2లో బోయపాటి శ్రీను కుమారుడు.. పాత్ర ఏంటో డైరెక్టర్ క్లారిటీ
Akhanda 2: టాలీవుడ్‌లో తిరుగులేని విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుల కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరి నుంచి రాబోతున్న సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’ గురించి అటు టాలీవుడ్‌తో పాటు ఇటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యకలాపాలను వేగవంతం చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను సోషల్ మీడియా వేదికగా సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ‘అఖండ 2’ లో బోయపాటి చిన్న కుమారుడు వర్షిత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడన్న విషయం ఇప్పటికే వెల్లడైంది. అయితే, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వర్షిత్ తాను నటిస్తున్నట్లు చెప్పినా, ఆ పాత్ర వివరాలు మాత్రం సస్పెన్స్‌గా ఉంచాడు. దీనిపై స్పందించిన దర్శకుడు బోయపాటి శీను, తన కుమారుడు వర్షిత్ ఈ చిత్రంలో భక్త ప్రహ్లాదుడిగా కనిపించబోతున్నాడనే పెద్ద అప్‌డేట్‌ను రివీల్ చేశారు.
సినిమా ట్రైలర్‌ను జాగ్రత్తగా గమనిస్తే, ప్రహ్లాదుడి గెటప్‌లో ఉన్న చిన్నారిని చూడొచ్చు. అయితే, పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లేని ఈ సినిమాలో భక్త ప్రహ్లాదుడి పాత్రను బోయపాటి ఎలా డిజైన్ చేశాడు, ఈ కథతో ఆ పాత్రకు ఉన్న లింక్ ఏంటి అనే వివరాలను మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. ఇది ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
‘అఖండ 2’లో తమిళ నటుడు ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తుండగా, బాలనటి హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ వంటి నటీనటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ నెట్టింట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మొదటి భాగం కంటే సీక్వెల్‌లో యాక్షన్ ఎలివేషన్స్, గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందించడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.
