Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ విజయాన్ని కొనసాగిస్తూ, దాని సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా టీజర్‌తో పాటుగా, ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ‘ఓజీ’ సినిమాతో పాటు ప్రదర్శితమవుతున్న ఈ టీజర్‌కు కొత్తగా విడుదల తేదీని జోడించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొదటి భాగం ‘అఖండ’ కూడా డిసెంబర్ 2న విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దాని కొనసాగింపు మూడు రోజుల తేడాతో రావడం విశేషం.
రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్
‘అఖండ 2: తాండవం’ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 80 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. సాధారణంగా ఇంత పెద్ద మొత్తం పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఉన్న నలుగురు తెలుగు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే లభిస్తుంది. బాలకృష్ణ సినిమాకు కూడా అదే రేటు పలకడం ఆయన క్రేజ్, ‘అఖండ’ విజయాన్ని సూచిస్తుంది. ఈ డీల్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంటలకు ఒక జాక్‌పాట్‌లా మారింది.
విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ, నాణ్యత విషయంలో రాజీ పడకుండా చిత్ర బృందం జాగ్రత్తలు తీసుకుంటుంది. బోయపాటి శ్రీను తన మార్క్ డైలాగులు, యాక్షన్‌తో పాటు మాస్, ఆధ్యాత్మికత, సామాజిక అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.