Akhanda 2: అఖండ 2 వచ్చేది అప్పుడే.. హింట్ ఇచ్చిన బాలయ్య బాబు
Akhanda 2: మాస్ ప్రేక్షకులకు ‘గాడ్ ఆఫ్ మాస్’గా సుపరిచితమైన నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘అఖండ 2’ విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తొలి భాగానికి మించి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా, తొలుత ప్రకటించిన సెప్టెంబర్ 25న విడుదల కావాల్సింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా బాలకృష్ణ స్వయంగా సినిమా విడుదల తేదీ గురించి ఓ కీలక అప్‌డేట్‌ను వెల్లడించారు.
ఒక బహిరంగ సభలో పాల్గొన్న బాలకృష్ణ, ‘అఖండ 2’ ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. అయితే, ఖచ్చితమైన తేదీని మాత్రం బాలకృష్ణ వెల్లడించలేదు. అభిమానుల అంచనాల ప్రకారం, డిసెంబర్ 5న శుక్రవారం కావడంతో అదే రోజు సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, నాణ్యత విషయంలో రాజీపడకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
మాస్, ఆధ్యాత్మికత, సామాజిక అంశాలు, మరియు యువతకు సందేశం వంటి అంశాలను మేళవిస్తూ బోయపాటి శ్రీను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తమన్ అందించిన శక్తివంతమైన సంగీతం, పవర్‌ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పండుగలా అనిపిస్తాయని సినీ వర్గాల టాక్. అంతేకాకుండా, సినిమా విడుదల కంటే ముందే డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్‌స్టార్’ దాదాపు రూ.85 కోట్లు చెల్లించి ఈ హక్కులను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.