Akhanda 2: శివమెత్తిన బాలయ్య.. ‘అఖండ 2’ ట్రైలర్‌తో బాక్సాఫీస్ దగ్గర మోత మొదలైంది
Akhanda 2: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘మాస్’ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నందమూరి బాలకృష్ణ. ఆయనకు తోడు ‘ఊర మాస్’ డైరెక్టర్ బోయపాటి శ్రీను జతకడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా కర్ణాటకలోని చింతామణి వేదికగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.
2 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్‌తో నిండిపోయింది. “కష్టమొస్తే దేవుడొస్తాడు అని నమ్మే జనానికి, కష్టమొచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి” అనే ఇంటెన్స్ వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. ముఖ్యంగా ధర్మం గురించి బాలయ్య చెప్పిన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. “ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా కనిపించేది మతం… ఈ దేశంలో కనిపించేది ధర్మం… సనాతన హైందవ ధర్మం” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక “మేం ఒకసారి లేచి శబ్ధం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్ధం” అంటూ ట్రైలర్ చివర్లో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందోకళ్ళకు కట్టింది.
ఈ చిత్రంలో బాలయ్య మురళీ కృష్ణగా క్లాస్ లుక్‌లోనూ, అఖండగా రుద్ర రూపంలోనూ డ్యూయల్ రోల్‌లో అదరగొట్టారు. విలన్‌గా ఆది పినిశెట్టి లుక్, హావభావాలు భయపెట్టేలా ఉన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలయ్య రెండో కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. మొత్తానికి త్రిశూలం పట్టుకుని బాలయ్య చేసే ఈ ‘తాండవం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.
