Akhanda 2: బాలయ్య ‘అఖండ 2 తాండవం’: మాస్ ఎలివేషన్స్‌తో టీజర్ అరాచకం..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ విడుదలకు రంగం సిద్ధమైంది. అంచనాలకు తగ్గట్టే సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై బాలయ్య అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది.
ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, పవర్ఫుల్ డైలాగ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి శక్తివంతమైన ప్రతినాయకుడిగా, పూర్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లు, ట్రైలర్ సినిమాపై బజ్‌ను భారీగా పెంచాయి. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య నటన, ఆధ్యాత్మికత మేళవింపుతో కూడిన పంచ్ డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
తాజాగా చిత్రబృందం ‘అఖండ 2 తాండవం’ పేరుతో మరో ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో బాలయ్య గెటప్స్, యాక్షన్ బ్లాక్స్, పవర్ఫుల్ డైలాగులు మాస్ లెవెల్‌ను అమాంతం పెంచేశాయి. టీజర్ ప్రారంభంలో విలన్ “భారత్‌ని కొట్టాలంటే… అక్కడి మూలాలను అడ్డం పెట్టుకొని కొట్టాలి” అని చెప్పే డైలాగ్ తర్వాత, త్రిశూలంతో శివస్వరూపంలో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చే సన్నివేశం విజువల్‌గా అద్భుతంగా ఉంది.
అఘోర లుక్‌లో కనిపించిన బాలయ్య “కొండల్లో తొండల్ని తిని బతికే మీరెక్కడ… ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ!” అంటూ పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. మరో సన్నివేశంలో గద పట్టుకుని బాలయ్య చేసే యాక్షన్ విన్యాసాలు, ఆ సమయంలో ఆకాశంలో కనిపించే హనుమంతుడి విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఆది పినిశెట్టి విలన్‌గా తన మాంత్రిక శక్తులతో సృష్టించే విధ్వంసం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి, బాలకృష్ణ అఘోర, శివుడు, సాధారణ నాయకుడు అనే మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనుండటం కొత్త కుతూహలాన్ని రేపుతోంది.
బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట–గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. బాలయ్య కెరీర్లో తొలి పాన్-ఇండియా రిలీజ్ ఇదే కావడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
