Akkineni Nagarjuna: ఏఐతో ఫోటోలు మార్ఫింగ్ అశ్లీలం.. ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పోరాటం
Akkineni Nagarjuna: ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగార్జున, తన అనుమతి లేకుండా కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి తన చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టను దిగజార్చేలా, అశ్లీల కంటెంట్‌తో కూడిన వీడియోలు, పోర్నోగ్రఫీ లింకులను రూపొందించి ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్నారని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అక్రమ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు.
నాగార్జున తరపున వాదించిన న్యాయవాది, కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ ఏఐ ద్వారా నాగార్జున పోర్నోగ్రఫీ కంటెంట్‌ను సృష్టించి వ్యాపారం చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, ఆయన ఫోటోలను టీ-షర్టులపై ముద్రించి విక్రయిస్తున్నారని, దీని వల్ల ఆయన ఇమేజ్, వ్యక్తిగత హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల తన వ్యక్తిత్వం ప్రమాదంలో పడిందని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కరియా, నాగార్జున వ్యక్తిగత హక్కులను పరిరక్షించడానికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఏఐ దుర్వినియోగం పెద్ద సమస్యగా మారిందని, ఇది కళాకారులు, ప్రముఖులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో, నాగార్జున ఏఐ వీడియోలు, అశ్లీల లింకులను ప్రచారం చేస్తున్న 14 వెబ్‌సైట్‌లను, వాటికి సంబంధించిన లింకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. గతంలో బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటివారు కూడా ఇలాంటి సమస్యలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కొన్నిరోజుల క్రితం నేషనల్ క్రష్ రష్మిక ఏఐ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. మరో యువతికి సంబంధించిన వీడియోలో రష్మిక మందన్నా ముఖంతో మార్చి చేసిన వీడియో అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ అశ్లీల వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏఐ సాంకేతికత వాడకానికి పరిమితులు ఉండాలని అప్పట్లో పెద్దఎత్తున డిమాండ్లు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
