Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ నాశనానికి కుట్ర.. సంచలన ఆరోపణలు చేసిన తల్లి మల్లిక
Prithviraj Sukumaran: ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సినీ కెరీర్‌ను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, ఆయనపై కుట్ర జరుగుతోందని నటుడి తల్లి, సీనియర్ నటి మల్లికా సుకుమారన్ సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయేవారే ఈ నీచమైన పనులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మలయాళ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.
పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విలాయత్ బుద్ధ’ నవంబర్ 21న విడుదలైంది. అప్పటి నుంచి ఆన్‌లైన్ వేదికల్లో కొందరు కావాలనే ఈ సినిమాపై, నటుడిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మల్లిక తెలిపారు. ఈ సినిమాను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తూ, ‘పుష్ప’ చిత్రంతో పోల్చుతూ పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్‌ను ఇండస్ట్రీ నుంచి పంపేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతోందని ఆమె తీవ్రంగా ఖండించారు.
“పృథ్వీరాజ్‌కు వ్యతిరేకంగా కొన్ని దాడులు జరిగినప్పుడు అతడికి మద్దతుగా నిలబడటానికి చాలా తక్కువమంది మాత్రమే ముందుకువచ్చారు. ఇప్పుడు కూడా ఆన్‌లైన్‌లో అతడిని లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడుతున్నారు. అతడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఎలాగైనా అతని కెరీర్‌ను నాశనం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంత నీచమైన ఆలోచనలు చేస్తారని నేను ఊహించలేదు. ఒక తల్లిగా, ఇలాంటి చర్యలు ఆపకపోతే, సరైన సమయం వచ్చినప్పుడల్లా నేను దీనిపై పోరాటం చేస్తూనే ఉంటాను” అని మల్లిక సుకుమారన్ స్పష్టం చేశారు.
‘విలాయత్ బుద్ధ’ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా జయన్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో అనుమోహన్, ధ్రువన్, వినోద్‌థామస్ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ వారణాసి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
మలయాళంలో ఇప్పటికే అగ్ర నటుడిగా స్థిరపడిన పృథ్వీరాజ్.. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు పొందనున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మహేశ్ బాబు చిత్రం (SSMB29)లో ఆయన కీలకమైన ‘కుంభ’ పాత్రలో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలోనే, కావాలనే కొందరు పృథ్వీ కెరీర్‌కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారని మల్లిక చేసిన వ్యాఖ్యలు మలయాళ సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాయి.
