Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినీ ప్రవేశంపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Pawan Kalyan: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ ప్రవేశం వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఇటీవల కన్నుమూసిన తన తల్లి అల్లు కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమంలో అరవింద్ ఈ విషయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్‌లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన తల్లి గొప్పతనం గురించి అల్లు అరవింద్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. తమ కుటుంబ విలువలు, ఆప్యాయత ఆమె నుండి వచ్చినవే అని గుర్తు చేసుకున్నారు. అల్లు కనకరత్నం గారు పవన్ కళ్యాణ్‌తో ఎంతో ఆత్మీయంగా ఉండేవారని, ఆయన్ని ఎప్పుడూ ముద్దుగా ‘కల్యాణి’ అని పిలిచేవారని అరవింద్ తెలిపారు.
“నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, సినిమాల్లోకి ఎందుకు రావు?” అంటూ అమ్మ పవన్‌ను అడిగేవారని అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు. దానికి పవన్, “నాకు చాలా సిగ్గు, ఇబ్బందిగా ఉంటుంది” అని బదులిచ్చేవారని పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. అంతేకాకుండా, తన తల్లి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ సినిమా చేయమని తనను కోరారని కూడా అరవింద్ చెప్పారు. పవన్ కళ్యాణ్ తన సినీ ప్రవేశానికి అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలే కారణమని గతంలో పలు సందర్భాల్లో చెప్పగా, అల్లు అరవింద్ వెల్లడించిన ఈ కొత్త విషయం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
అల్లు కనకరత్నం గారు ఎంతో గొప్ప జీవితాన్ని గడిపారని, చిరంజీవి లాంటి అల్లుడిని, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలైన మనవళ్లను చూశారని అరవింద్ భావోద్వేగంగా పేర్కొన్నారు. రెండు గొప్ప కుటుంబాల నుంచి ఎందరో స్టార్స్‌ను చూసిన ఆమె జీవితం ఆనందంగా ముగిసిందని అరవింద్ చెప్పారు. అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.