Allu Aravind on Pawan Kalyan: సనాతనం గురించి పవన్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు..
Pawan Kalyan: యానిమేషన్ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న ‘మహావతార్ నరసింహ’ చిత్ర విజయోత్సవ సభ హైదరాబాద్‌లో జరిగింది. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు సనాతన ధర్మంపై ఉన్న అవగాహనను ప్రశంసిస్తూ, ఆయన ఈ చిత్రాన్ని చూసి మాట్లాడాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
పవన్ మాట్లాడుతుంటే మంత్రముగ్దులైపోతాం..
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “మా కుటుంబంలో, మాకు తెలిసిన వారిలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆయన ఆ విషయంపై ప్రసంగిస్తుంటే అందరూ మంత్రముగ్ధులై వింటారు. అటువంటి వ్యక్తి ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని చూసి, దాని గురించి తన అభిప్రాయాలను పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని అన్నారు. చిత్ర విజయంపై మాట్లాడుతూ, “2021లో మొదలైన ఈ చిత్ర ప్రయాణంలో దర్శకనిర్మాతలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. వారి పట్టుదలకు, భక్తికి ఆ నరసింహ స్వామి వారే ఈ అద్భుతమైన విజయాన్ని అందించారు. కేవలం రెగ్యులర్ ప్రేక్షకులే కాకుండా, ఎప్పుడూ థియేటర్లకు రాని వారు కూడా ఈ చిత్రాన్ని చూసి ఒక ఉద్వేగానికి లోనవుతున్నారు,” అని తెలిపారు.
ప్రముఖుల ప్రశంసల వర్షం..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “సినిమా మొదలైన మూడో నిమిషం నుంచే నేను థియేటర్‌లో లేను, ఒక గుడిలో ఉన్నాననే అనుభూతి కలిగింది. ఈ చిత్ర దర్శకుడు అశ్విన్, యావత్ ప్రపంచానికి నరసింహ స్వామిని దర్శనం చేయించారు. ఈ సినిమాను తీసిన వారు, చూసిన వారు అందరూ ధన్యులు,” అంటూ ప్రశంసించారు. ప్రముఖ రచయిత జొన్నవిత్తుల మాట్లాడుతూ, “ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశం ఈ చిత్రంలో ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా ఇది,” అని పేర్కొన్నారు.