Allu Arjun Atlee Movie: అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్టుపై క్రేజీ అప్డేట్.. కీలక పాత్రలో కనిపించనున్న ఆ క్రేజీ యాక్టర్
Allu Arjun Atlee Movie: ‘పుష్ప 2’ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించనున్న తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకో కొత్త సమాచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది గనుక నిజమైతే, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన కాంబినేషన్లలో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం.
దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో రూపొందుతోందని సమాచారం. టైమ్ ట్రావెల్, వారియర్ కాన్సెప్టులతో ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చకచకా సాగుతున్నాయి. విజయ్ సేతుపతి ఇందులో ప్రతినాయకుడిగా లేక శక్తివంతమైన మరో పాత్రలో కనిపించనున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన షారుఖ్ ఖాన్ చిత్రం ‘జవాన్’లో విజయ్ సేతుపతి విలన్‌గా తన నట విశ్వరూపం చూపించి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. అట్లీ-విజయ్ సేతుపతి మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఈ ప్రాజెక్టులో ఆయన భాగమవుతున్నారని తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కథానాయికగా దీపికా పదుకోన్ నటించనుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో జరిగిన ఒక వర్క్‌షాప్‌లో అల్లు అర్జున్, అట్లీతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నారని సమాచారం. దీపికా పదుకోన్ డేట్స్ క్లియర్ కావడంతో నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2027లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు.