Allu Aravind: అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?
Allu Aravind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (94) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచారు.
కనకరత్నమ్మ మరణవార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ ప్రముఖులు, కుటుంబసభ్యులు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సురేఖ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ విషాద సమయంలో వారికి అండగా నిలిచారు.
ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ షూటింగ్‌ల నిమిత్తం ముంబై, మైసూరులో ఉన్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే హైదరాబాద్ బయల్దేరారు. రామ్ చరణ్ కూడా ప్రత్యేక విమానంలో రానున్నట్లు సమాచారం. ఇద్దరూ మధ్యాహ్నం నాటికి హైదరాబాద్ చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతూన్న 94 ఏళ్ల అల్లు కనకరత్నం మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై కనకరత్నంకు చికిత్స అందించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అనంతరం కనకరత్నం కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా, తెలుగు చిత్ర పరిశ్రమలో తిరిగులేని కమెడియన్, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో అల్లు అరవింద్, కుమార్తె సురేఖ అందరికి తెలిసిందే.
2004లో అల్లు రామలింగయ్య మరణించారు. ఆ తర్వాత కనకరత్నం బయటక ఎక్కువగా కనిపించలేదు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో మాత్రమే అల్లు కనకరత్నం కనిపించారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేశారు. “మా అత్తయ్య, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం. ఆమె మా కుటుంబాలపై చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు మాకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచిపోతాయి. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.
అల్లు కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున సంతాప సందేశాలు అందుతున్నాయి. అల్లు అరవింద్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.