Allu Arjun: ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, చాలా కొత్తగా ఉంది.. లిటిల్ హార్ట్స్‌పై అల్లు అర్జున్
Allu Arjun: సగటు ప్రేక్షకుడి నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటూ, బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈ చిన్న సినిమాను ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు అభినందించగా, తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, సినిమా బృందాన్ని అభినందించారు.
“లిటిల్ హార్ట్స్ ఒక నవ్వుల ప్రయాణం. ఇందులో ఎలాంటి మెలోడ్రామా లేదు, కేవలం పూర్తి వినోదం మాత్రమే ఉంది. ఈ ప్రేమకథలో ఒక కొత్తదనం కనిపిస్తుంది” అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ సినిమాకు కంటెంటే ప్రధాన బలం అని ఆయన కొనియాడారు. ప్రధాన పాత్రలో నటించిన మౌళి అద్భుతమైన నటనను ప్రదర్శించాడని, అలాగే హీరోయిన్ శివాని నాగరం, ఇతర నటీనటులందరి పెర్ఫామెన్స్ చాలా బాగుందని ప్రశంసించారు.
దర్శకుడు సాయి మార్తాండ్ టేకింగ్‌ను కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్నారు. అలాగే సింజిత్ యెర్రమల్లి అందించిన సంగీతం కొత్తగా ఉందని అన్నారు. ఈ ప్రత్యేకమైన సినిమాను థియేటర్లకు తీసుకొచ్చిన నిర్మాత బన్నీ వాసుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించగా, బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేశారు.
https://x.com/alluarjun/status/1966087477455888598
తొలుత ఓటీటీ సినిమాగా ప్లాన్ చేసినా, కథపై ఉన్న నమ్మకంతో థియేటర్లలోకి విడుదల చేసి విజయం సాధించారు. హీరోగా తొలి ప్రయత్నంలోనే మౌళి, దర్శకుడు సాయి మార్తాండ్ తమ ప్రతిభను చాటుకున్నారు. అల్లు అర్జున్‌తో పాటు రవితేజ, నాని, నాగచైతన్య, అల్లరి నరేష్ వంటి అగ్ర తారలు కూడా ఈ చిత్రాన్ని అభినందించారు.