Allu Arjun: బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ జోరు.. తేజ సజ్జాపై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు
Allu Arjun: యువ కథానాయకుడు తేజ సజ్జా నటించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ.140 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఫ్యూచరిస్టిక్ స్టోరీ, అద్భుతమైన గ్రాఫిక్స్, అడ్వెంచర్ సన్నివేశాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విజయంపై ఇండస్ట్రీలోనూ భారీ స్పందన వస్తోంది. తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘మిరాయ్’ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు.
అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా ‘మిరాయ్’ టీమ్‌కు అభినందనలు తెలిపారు. “మిరాయ్ అద్భుతమైన సినిమా. తేజ సజ్జా నీ కష్టానికి, డెడికేషన్‌కి హ్యాట్సాఫ్. ఇలాంటి సినిమాలు చేయడం చిన్న విషయం కాదు” అంటూ తేజ సజ్జాను మెచ్చుకున్నారు. అంతేకాకుండా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరన్, జగపతిబాబు పాత్రలను కూడా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సినిమా సాంకేతిక అంశాలను ప్రశంసించిన అల్లు అర్జున్, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్ మిక్సింగ్, గౌర హరి అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిని ‘న్యూ ఏజ్ కమర్షియల్ డైరెక్టర్’గా అభివర్ణిస్తూ, ఈ సినిమాకు కీలకమైన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌ను, సాంస్కృతిక భావోద్వేగాలను సమపాళ్లలో మిక్స్ చేసిన ఆయన ప్రతిభను కొనియాడారు. అలాగే, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కూడా అభినందనలు తెలియజేశారు.
‘మిరాయ్’తో తేజ సజ్జా నటుడిగా మరో మెట్టు ఎక్కారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన యాక్షన్, ఎమోషన్స్, వైవిధ్యభరితమైన నటన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీతో పాటు కథనాన్ని కూడా చక్కగా నడిపించారని, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారని వారు చెబుతున్నారు. ఒక స్టార్ హీరో నుంచి ప్రశంసలు అందుకోవడంతో ‘మిరాయ్’ చిత్ర బృందం సంతోషం రెట్టింపయింది. ఈ విజయం తేజ సజ్జా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.