Amala Akkineni: కోడళ్ల రాకతో ఇంట్లో గర్ల్స్ సర్కిల్.. శోభిత, జైనబ్‌లపై అమల ఆసక్తికర కామెంట్స్
Amala Akkineni: టాలీవుడ్ ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున సతీమణి అమల అక్కినేని ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చివరిసారిగా ఆమె మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయకపోయినా, ఆమె సామాజిక కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమల అక్కినేని తన కోడళ్లైన శోభిత ధూళిపాల (నాగ చైతన్య భార్య), జైనబ్ రవ్‌డ్జీ (అఖిల్ అక్కినేని భార్య)తో తన అనుబంధం గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నాకు అద్భుతమైన కోడళ్లు దొరికారు. వాళ్ళు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు. వాళ్ల రాకతో నా జీవితం కొత్తగా, ఉల్లాసంగా మారింది. ముఖ్యంగా, మా ఇంట్లో ఇప్పుడు నాకు ఒక ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది” అంటూ నవ్వుతూ తమ అనుబంధాన్ని వివరించారు.
తన కోడళ్లు, అత్తగారి పాత్ర గురించి మాట్లాడుతూ అమల తన వ్యక్తిత్వాన్ని వెల్లడించారు. “నా కోడళ్లు ఇద్దరూ తమ వృత్తుల్లో చాలా బిజీగా ఉంటారు. యువతరం ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండడం చాలా మంచి విషయం. వారి వారి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉంటే, నేను నా పనుల్లో ఉంటాను. సమయం దొరికినప్పుడు మాత్రం మేమంతా కలిసి సరదాగా గడుపుతాం. నేను డిమాండ్ చేసే అత్తను కాదు… అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు,” అంటూ చిరునవ్వుతో చెప్పారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంలో కోడళ్లకు లభించే స్వేచ్ఛ, గౌరవాన్ని సూచిస్తున్నాయి.
తన కుమారులు నాగ చైతన్య, అఖిల్ గురించి అమల అక్కినేని గర్వంగా మాట్లాడారు. “వాళ్లిద్దరూ అద్భుతమైన యువకులుగా ఎదిగారు. నాగార్జున గారికి వారిపై అపారమైన ప్రేమ, ఆప్యాయత ఉంది. నేను మాత్రం బాధ్యతల పట్ల కచ్చితంగా ఉండే ‘నో-నాన్‌సెన్స్’ పేరెంట్‌ను,” అని పేర్కొన్నారు. నాగ చైతన్య 2024లో నటి శోభిత ధూళిపాలను, అఖిల్ అక్కినేని 2025లో ఆర్టిస్ట్, వ్యాపారవేత్త అయిన జైనబ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కుటుంబ జీవనాన్ని ఆస్వాదిస్తున్న అమల.. “ఇప్పటి నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతోంది” అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.