Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా మూవీలో అనంతిక.. ఆ క్రేజీ ప్రాజెక్టుపై లేటెస్ట్ అప్డేట్
Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలనాత్మక చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు నిర్మాతగా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాకు సన్నాహాలు చేస్తున్న ఆయన, తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఒక యువ ప్రేమకథను నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
దర్శకుడిగా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న సందీప్ వంగా, ఇప్పుడు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు దర్శకత్వం వహించనున్నారు. హీరోగా ‘మేం ఫేమస్’ చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది. ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటించనున్నట్లు కూడా సమాచారం. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమకథగా రూపొందనుందని సమాచారం. కథ, కథనాల్లో సందీప్ వంగా శైలి కనిపిస్తుందని, యువ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సందీప్ వంగా ప్రధానంగా ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై దృష్టి పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. సినిమాలోని ముఖ్య సన్నివేశాల కోసం మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశాల్లో లొకేషన్లు పరిశీలించి వచ్చారు. ఈ భారీ ప్రాజెక్ట్‌తో పాటు చిన్న సినిమాను నిర్మించడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడిగా తన మార్క్ చూపించిన సందీప్, నిర్మాతగా ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి. ఈ యువ టీం కాంబినేషన్, సందీప్ వంగా లాంటి అగ్ర దర్శకుడు నిర్మాతగా వ్యవహరించడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.