Nagarjuna: మన్మధుడు పుట్టినరోజు.. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పెషల్ గిఫ్ట్!
Nagarjuna: టాలీవుడ్‌లో ‘కింగ్’, ‘మన్మధుడు’గా అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అక్కినేని నాగార్జున నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక అద్భుతమైన మ్యాషప్ వీడియోను విడుదల చేసి, ఆయన అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది.
ఈ మ్యాషప్ వీడియోలో నాగార్జున సినీ ప్రయాణాన్ని చూపించడమే కాకుండా, ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన వివిధ చిత్రాలలోని ఐకానిక్ డైలాగ్స్‌ను చేర్చారు. 66 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ, విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్న నాగార్జునపై ఈ వీడియోతో మరోసారి అభిమానం పెంచుకునేలా చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ట్రై చేయాలంటే నేనే’ లాంటి డైలాగ్స్ ఈ మ్యాషప్ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఈ వీడియో విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కినేని నాగార్జున గ్రీకువీరుడు, మన్మధుడు, కింగ్ వంటి బిరుదులకు ఎలా సార్థకత చేకూర్చారో ఈ వీడియో మరోసారి స్పష్టం చేసింది. అభిమానులు #HBDKingNagarjuna అనే హ్యాష్‌టాగ్‌తో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ ప్రేమను చాటుకుంటున్నారు.
