నగరవాసులకు అంతర్జాతీయ స్థాయి నిర్మాణం మరికొద్ది రోజుల్లో స్వాగతం పలుకనుంది. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో నగరానికి ఒక్కొక్కటిగా తలమానికమైన ప్రాజెక్టులను అందిస్తుంది. మెట్రో రైల్ వచ్చిన తర్వాత నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం1గంట వ్యవధిలోపు చేరుకుంటూ సమయాన్ని ఆదా చేసుకుంటున్న నగరవాసులకు ఇంకో అద్భుతమైన కట్టడం నిర్మాణంతో నగరపాలక సంస్థ ప్రజల అవసరాలు తీర్చబోతుంది.
దుర్గం చెరువు ఐకానిక్ బ్రిడ్జి 184 కోట్ల ప్రతిష్టాత్మక నిర్మాణం.
జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో జిహేచ్ఎంసీ-ఎల్ అండ్ టి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ తీగల వంతెన పైనుండి జూబ్లీహిల్స్ నుండి ఐకియా స్టోర్ వరకూ సిగ్నల్స్ తో పని లేకుండా సాగిపోవచ్చు. ఈ వంతెన నిర్మాణం వలన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 మాదాపూర్, మైండ్ స్పేస్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే బ్రిడ్జి నిర్మాణ పనులు, విద్యుదీకరణ పనులు పూర్తి చేసుకొని ట్రయల్ రన్ కూడా పూర్తయింది. విద్యుదీకరణ పనులు కోసం 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు.
రాత్రిపూట ప్రయాణం చేసేవారికి సరికొత్త తరహ లైటింగ్ వెలుగులతో ఈ ఐకానిక్ బ్రిడ్జి స్వాగతం పలుకనుంది. మొత్తం బ్రిడ్జి పొడవు 754.62 మీటర్లు,వెడల్పు 26 మీటర్లతో నాలుగు లైన్ల రహదారి ఏర్పాటయింది. 2 అతిపెద్ద పిల్లర్స్ తో 26 బలమైన తీగలతో నిర్మితమైన ఈ బ్రిడ్జి డిజైన్ లూయిస్ బార్గ్ అందించింది. ఈ బ్రిడ్జి ఆసియాలో మూడో అతి పెద్దది భారత్ కోల్ కతా హౌరా బ్రిడ్జి కంటే పెద్దది. బ్రిడ్జి నిర్మాణం తో పాటు దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతాలను పర్యాటకంగా ఆకట్టుకునే విధంగా హరితహారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ప్రారంభమైతే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
