“నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష” అనే రీతిలో తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు కి అదే రీతిలో సమాధానం చెప్పబోతుంది వైసీపి. పార్టీ మారే వాళ్ళు తప్పనిసరిగా రాజీనామా చేసే రావాలని, అదే మా తండ్రిగారు నేర్పిన విశ్వసనీయత అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలను, నినాదాలను పక్కన పడేసి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు.
ఇప్పటికే జనసేన పార్టీ నుండి రాపాక రాజీనామా చేయకుండానే అనధికారికంగా వైసీపీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. టిడిపి నుండి కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ కుమార్ లు వైసీపీలో కొనసాగుతుండగా ఇప్పుడు వైజాగ్ పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే గణబాబు (పి జి వీఆర్. నాయుడు) వైసీపీలో చేరనున్న ట్లు తెలిసింది. టిడిపి నుండి వైసీపీ లోకి వస్తున్న నాలుగో వ్యక్తి ఈయన. గెలిచిన 23 లోంచి ఇప్పటికే నలుగురు ఇటు వైపు వచ్చేసారు. మరో నలుగురు సభ్యులను టిడిపి నుండి తీసుకొని ఆ పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టాలనేది వైసీపి నాయకుల ఆలోచన. దాన్ని ఆచరణ లో పెట్టడం వైసీపీ కి అసాధ్యం కాకపోవచ్చు.
